అమరావతి కేంద్రంగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ కార్యాలయం
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:33 AM
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యాలయాన్ని కేటాయించింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) కార్యాలయాన్ని కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
రాజధానికి కేంద్ర ప్రభుత్వం కేటాయింపు
కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యాలయాన్ని కేటాయించింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) కార్యాలయాన్ని కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి పేరుతో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 కింద గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరణలు చేసింది. పాత జాబితాలోని క్రమసంఖ్య 8 నుంచి ఆంధ్రప్రదేశ్‌ను తొలగించి, కొత్తగా క్రమసంఖ్య 17ను చేర్చి ‘విదేశీ ప్రాంతీయ రిజిరేస్టషన్ అధికారి, అమరావతి’ పరిధి కింద ఆంధ్రప్రదేశ్‌ను చేర్చారు. రాష్ట్రానికి వచ్చే విదేశీయుల రిజిస్ట్రేషన్లు, వీసా గడువు పొడిగింపు, వీసా మార్పిడి, ఇతర ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలను ఈ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రానికి విదేశీ ప్రతినిధుల రాకపోకలకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుంది.