ఆ చీడ పురుగులకు..ఏ మందు వాడాలో మాకు తెలుసు!
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:58 AM
రాజధాని అమరావతి చీడపురుగులకు ఏ మందు వాడలో రైతులుగా తమకు బాగా తెలుసని రాజధాని అమరావతి సమన్వయ కమిటీ, రైతు జేఏసీ స్పష్టంచేశాయి.
అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతోందనే అలజడులకు కుట్ర
రాజధాని అమరావతి సమన్వయ కమిటీ, రైతు జేఏసీ ధ్వజం
తుళ్లూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి చీడపురుగులకు ఏ మందు వాడలో రైతులుగా తమకు బాగా తెలుసని రాజధాని అమరావతి సమన్వయ కమిటీ, రైతు జేఏసీ స్పష్టంచేశాయి. ఉండవల్లి లాంటి ఘటనలకు పాల్పడాలని చూస్తే వెనక్కి తిరిగి వెళ్లరని, బొందకడతామని వైసీపీ నేతలను హెచ్చరించాయి. ‘అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. అలజడులు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్నాడు. అమరావతిలో అభివృద్ధి జరగడం ఆయనకు ఇష్టం లేదు’ అని మండిపడ్డాయి. ఉండవల్లిలో సీఆర్‌డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో శనివారం వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, మరికొంత మంది రౌడీలు కలసి అలజడులు సృష్టించాలని చూడడంపై ఆదివారం మందడం జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. అమరావతిని విధ్వంసం చేసిన వైసీపీ నేతలు రాజధానిలో అడుగు పెడుతున్నట్లు ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం రైతులకు ముందే తెలియడంతో అడ్డుకున్నారని.. మిగతా 26 గ్రామాల రైతులకు తెలిసి ఉంటే వెనక్కి తిరిగి వెళ్లేవారు కాదని తేల్చిచెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని నాశనం చేయాలని జగన్‌రెడ్డి ఇప్పటికీ చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడని జగన్‌రెడ్డి బ్యాచ్ రాజధాని రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తోందన్నారు. 36 మంది రౌడీలను వెంటబెట్టుకొచ్చి ప్రశాంతమైన అమరావతిలో అలజడులు సృష్టించాలని చూశారన్నారు.
నాడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి మత కలహాలు లేపితే.. అమరావతిలో ఆయన కులాలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘మూడు రాజధానులకు వ్యతిరేకంగా 1631 రోజుల ఉద్యమంలో మాపై లాఠీచార్జి చేశారు.. ఆడవాళ్లను బూటు కాళ్లతో తన్నారు.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు.. అప్పుడు వైసీపీ వాళ్లు ఎందుకు పరామర్శకు రాలేదు? పార్లమెంటులో 11 పార్టీలు ఏపీ రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా అంగీరించాయి. వైసీపీ మాత్రం వాకౌట్ చేసింది. అటువంటి పార్టీకి అమరావతిలో పర్యటించే అర్హత లేదు. మావిగన్, మూడు రాజధానులంటూ విషం కక్కితే.. మళ్లీ పోరాటానికి దిగుతాం’ అని హెచ్చరించారు. సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు బెల్లంకొండ నరసింహరావు, అనుమోలు బాలమురళీ కృష్ణ, ఆలూరి శ్రీనివాసరావు, లంకా సుధాకరరావు, కళ్లం రాజశేఖరరెడ్డి, ఆకుల ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.