Share News

‘మావిగన్‌’ మారీచులకు రాజధానిలో పనేంటి?

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:38 AM

‘‘అమరావతి రైతులు శాంతి కాముకులు. వాళ్లకు జనాలపై రాళ్లూ, రప్పలూ వేయడం తెలియదు.’’ అని రాష్ట్ర సామాజిక, సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య అన్నారు.

‘మావిగన్‌’ మారీచులకు రాజధానిలో పనేంటి?

  • అమరావతి రైతులు శాంతి కాముకులు

  • రాళ్లూ, రప్పలూ వేయడం తెలియదు

  • సంక్షేమ బోర్డు చైర్మన్‌ బాలకోటయ్య

  • గూండాలను అడుగుపెట్టనీయం: రైతులు

విజయవాడ, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి రైతులు శాంతి కాముకులు. వాళ్లకు జనాలపై రాళ్లూ, రప్పలూ వేయడం తెలియదు.’’ అని రాష్ట్ర సామాజిక, సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య అన్నారు. సోమవారం అమరావతి ఉద్యమ రైతులతో కలిసి విజయవాడలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మావిగన్‌’ మారీచులకు అమరావతిలో పనేంటని బాలకోటయ్య ప్రశ్నించారు. రౌడీషీటర్లను వెంటబెట్టుకుని రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకే వైసీపీ నేతలు ఉండవల్లి వెళ్లారని ధ్వజమెత్తారు. 1,631 రోజుల అమరావతి శాంతియుత ఉద్యమంలో రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడలేదని తెలిపారు. పంటను కాపాడుకున్నట్టు, మరో ఉద్యమం చేసైనా రాజధానికి రైతులే రక్షణ కవచాలుగా ఉండాలని కోరారు. అమరావతి అభివృద్ధికి విఘాతం కలిగించే శక్తులను కట్టడి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


వైసీపీ కుతంత్రాలు

అమరావతిలో గూండాలను అడుగు పెట్టనీయబోమని రాజధాని ఉద్యమ రైతులు హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఘర్షణలు సృష్టించేందుకే ఉండవల్లిలో ఉద్రిక్తతలకు పాల్పడ్డారని అన్నారు. రాజకీయ అజెండాతో రాజధానిలోకి వస్తే అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. భూములు ఇవ్వని కొంతమంది రైతులను సాకుగా చూపించి.. రాజధానిలో కుట్రలు చేస్తున్నారని రైతు జేఏసీ నాయకుడు బుచ్చి తిరుపతిరావు ఆరోపించారు. ఉద్యమ సమయంలో మహిళా దినోత్సవం రోజు అమ్మవారికి పొంగళ్లు తీసుకెళ్తున్న ఆడబిడ్డలపైనా దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన వైసీపీ నాయకులకు అమరావతిపై మాట్లాడే నైతిక అర్హత లేదని మహిళా జేఏసీ నాయకురాలు వై. నాగమల్లేశ్వరి అన్నారు. ‘‘అమరావతిలో వైసీపీ నేతలు చేయని పాపాలు లేవు. నాటి హింసాత్మక ఘటనలు తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయి.’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై మరోసారి కుట్రలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మందడం శిబిర నిర్వాహకులు ఆలూరి యుగంధర్‌, అనంతవరం శిబిర నిర్వాహకులు పోలు దుర్గ, ఆలూరి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిని కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు.

Updated Date - Jun 30 , 2026 | 04:39 AM