లాటరీ ద్వారానే రైతులకు ప్లాట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 04:59 AM
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలిపారు.
పూర్తి పారదర్శకత పాటించాం
అమరావతి రాజధానిలో 98శాతం ప్లాట్లు,89 శాతం రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం
కేసులు, వివాదాలతో కొన్ని పెండింగ్
దురుద్దేశంతోనే వైసీపీ రాద్ధాంతం
వారంలో ఎమ్మెల్యే క్వార్టర్లు జీఏడీకి
మంత్రి నారాయణ స్పష్టీకరణ
గుంటూరు(రాజధాని), మే 12(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. భూములిచ్చిన రైతుల్లో 98 శాతం మందికి ప్లాట్లు కేటాయించామన్నారు. వాటిలో 89 శాతం ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టు చెప్పారు. కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని, అయితే.. కోర్టు కేసులు, కుటుంబ వివాదాల నేపథ్యంలోనే ఈ ప్రక్రియ నిలిచిందని తెలిపారు. రాజకీయ కుట్రతోనే వైసీపీ నేతలు రైతుల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో మంగళవారం ఆయన పర్యటించారు. తుది దశ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఇంటీరియర్, మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో ప్లాట్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు.
రైతులకు అన్నీ తెలుసు
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు లాటరీ విధానంలో చేపట్టామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్లాట్ల కేటాయింపు సమయంలో రైతులను పిలిచి ఆయా ప్లాట్లకు సంబంధించిన మ్యాప్ చూపించి.. ఆన్‌లైన్ లాటరీ విధానంలో కేటాయించామని చెప్పారు. అనుకూలంగా ఉన్న వారికి మంచి ప్లాట్లు కేటాయించామని అసత్యాలు ప్రచారం చేయడం వైసీపీ నాయకులకు తగదని హితవు పలికారు. ఏ గ్రామంలో భూములిస్తారో అదే గ్రామంలో రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని, ఒకవేళ ఆ గ్రామంలో అందుబాటులో లేకుంటే పక్క గ్రామాల్లో ప్లాట్లు కేటాయిస్తామని గతంలోనే చెప్పామన్నారు. ఈ విషయం రైతులకు కూడా తెలుసునన్నారు. ప్లాట్ల కేటాయింపు అదే విధానంలో జరిగిందన్నారు. ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా చేయలేదని మంత్రి తెలిపారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులతో అమరావతి నిర్మాణం సాధ్యం కాదని అనుకున్నారని, దానికి భిన్నంగా అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంటే ఓర్వలేని తనంతో ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం ఇప్పటి వరకు 30,753 మంది రైతులు 35,017 ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. వీరిలో 30,079 మంది రైతులకు(97శాతం) 34,527 ఎకరాల్లో ప్లాట్లు(98.6శాతం) కేటాయించామన్నారు. మరో 59 మందికి చెందిన 140.25 ఎకరాలలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు లాటరీ నిర్వహిస్తామన్నారు. మరోవైపు రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా 89.3 శాతం పూర్తయినట్లు మంత్రి నారాయణ చెప్పారు. కాగా, భూసమీకరణకు రైతులు ముందుకు రాని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించారని, కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
2028 నాటికి ఐకానిక్ టవర్లు
అమరావతిలో ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఐకానిక్ టవర్లను 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని సీఎం సూచించారని, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల 12 టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయినట్లు చెప్పారు. వారం రోజుల్లో ఎమ్మెల్యేల ఫ్లాట్లను, మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీల ఇళ్లను జీఏడీకి అప్పగిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారుల భవనాలు, మంత్రుల బంగళాల నిర్మాణం తుదిదశకు చేరుకుందని చెప్పారు. ఈ నెలాఖరుకు కొన్ని ఇళ్లను, వచ్చే నెలాఖరుకు మిగిలిన భవనాలు ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్ డీ ఉద్యోగుల భవనాల అంతర్గత పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. అమరావతి నిర్మాణం గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారని చెప్పారు.