Share News

కృష్ణానదిపై మరిన్ని వంతెనలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:54 AM

విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్‌లో కృష్ణా నదిపై ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయించనున్నారు.

కృష్ణానదిపై మరిన్ని వంతెనలు

  • ఎన్ని నిర్మించాలనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం

  • అమరావతిలో నెట్‌వర్క్‌ విస్తరణకు 20చోట్ల 5జీ టవర్లు

  • పీపీపీ విధానంలో రోప్‌వే ప్రాజెక్టు: నారాయణ

  • క్వాంటమ్‌ వ్యాలీలో 18 అంతస్తులతో 2 టవర్లు

  • 9 గిగావాట్ల డేటా సెంటర్‌, ‘అమరావతి ఐ’కి టెండర్లు

  • 64వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్‌లో కృష్ణా నదిపై ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 64వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రైల్వేలైన్‌ నిర్మాణానికి మోతడక గ్రామంలో భూమిని సేకరిస్తున్నామని, అక్కడ 2,340 ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదించిందని వివరించారు. పల్నాడు జిల్లాలో దేవదాయ శాఖకు చెందిన 244.39 ఎకరాల ఇనామ్‌ భూములను భూసమీకరణ కింద తీసుకొని, రూ.122 కోట్లు చెల్లించడానికి అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. 2014-19లో ప్రారంభించిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సంబంధించి రెన్యువల్‌ ఫీజు రద్దు చేయడానికి ఏపీ రెరా అంగీకరించిందని చెప్పారు. రైతులకు యాన్యుటీ కింద గత నెలలో రూ.300 కోట్లు చెల్లించామని, దీనికోసం తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్‌ చేశామన్నారు. 9 గిగావాట్ల డేటా సెంటర్‌కు టెండర్‌ పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. అమరావతిలో నెట్‌వర్క్‌ విస్తరణ కోసం 20 ప్రాంతాల్లో 5జీ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. రోప్‌వే ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపట్టేందుకు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, దుర్గగుడి, పున్నమిఘాట్‌, భవానీ ఐల్యాండ్‌ మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుసంధానించేలా అనుమతి ఇచ్చామని వివరించారు.


క్వాంటమ్‌ వ్యాలీలో 18 అంతస్తులతో రెండు టవర్లు నిర్మించేందుకు రూ.1,205 కోట్లతో ఎల్‌అండ్‌టీకి అప్పగించామని తెలిపారు. రాజధానిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘అమరావతి ఐ’ టెండర్‌ పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని, వర్షాలు రాకుండా ఉంటే ఈ నెల 13న సీఎం చంద్రబాబు దానిని ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు సిద్ధమయ్యాయని, అదే రోజు వాటిని సీఎం జీఏడీకి అప్పగిస్తారని చెప్పారు. మొత్తం రాజధాని నగరంలో 217 కిలోమీటర్ల పరిధిలో నాలుగు మురుగనీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

Updated Date - Aug 05 , 2026 | 03:56 AM