వేగం పెరగాలి..!
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:31 AM
కూటమి ప్రభుత్వం రావడంతో 6కోట్లమంది ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ కళ వచ్చింది. జగన్ ఏలుబడిలో ఐదేళ్లూ విధ్వంసానికి గురైన అమరావతికి మళ్లీ ప్రాణం వచ్చింది.
రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు
పట్టాలెక్కించడమే కాదు లక్ష్యం చేరాలి
ప్రభుత్వ చొరవ, చట్టబద్ధత, నిధులు.. ఓకే
కానీ నిర్మాణ పనుల్లో ఆ జోరేదీ?
భవనాల నిర్మాణాల్లో దాదాపు పురోగతి
రోడ్లు, మౌలిక వసతుల పనులు నత్తనడకన
రెండేళ్లలో రైతుల లే అవుట్ల పనులు 10 శాతమే పూర్తి
లక్ష్యానికి దూరంగా రహదారుల నిర్మాణం
దీనికితోడు రానున్న వర్షాకాలం ఎఫెక్ట్
మరోవైపు తీరని రాజధాని రైతుల సమస్యలు
మలి విడత భూసమీకరణపై ప్రభావం
రాజధాని నిర్మాణం అంటే.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, అధికారిక నివాసాలు కట్టడం మాత్రమే కాదు. రోడ్లు వేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి.
అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగానే జరుగుతున్నాయి. కానీ రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రైతుల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు పదేళ్లయినా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం రావడంతో 6కోట్లమంది ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ కళ వచ్చింది. జగన్ ఏలుబడిలో ఐదేళ్లూ విధ్వంసానికి గురైన అమరావతికి మళ్లీ ప్రాణం వచ్చింది. ప్రధాన మోదీ చేతుల మీదుగా రాజఽధాని నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయించడం.. గత ప్రభుత్వంలో అర్ధాంతంగా ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించడం.. కేంద్రం సాయం చేయడం.. రాజధాని పనులే గాక పలు ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయడం, వాటికి భూములు కేటాయించడం.. పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం చకచకా జరిగాయి. అయితే నవనగర నిర్మాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థాయిలో ఇప్పుడు పనులు జరగడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు-ప్రజాప్రతినిధుల నివాస భవనాల నిర్మాణాల వరకు పురోగతి కనిపిస్తోంది. కానీ రోడ్లు, మౌలిక వసతుల కల్పన పనులు లక్ష్యంగా దిశగా సాగడం లేదు. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల లేఅవుట్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి.
రెండో దశ భూసమీకరణకు బ్రేకులు
తొలి విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు 10 ఏళ్లయినా రిటర్నబుల్ ప్లాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా జరిగిన నష్టం, జాప్యంపై రైతులు అర్థం చేసుకున్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా న్యాయంజరగడం లేదన్న భావన రైతుల్లో కనిపిస్తోంది. గతంలో ఒకఏడాదిలో జరిగిన పనుల వేగాన్ని చూసిన రైతులకు ప్రస్తుత పనుల వైఖరి నిరాశ కలిగిస్తోంది. రాజధానిలో మొత్తం నిర్మాణ పనుల్లో ఈ ఏప్రిల్ వరకు 13.85 శాతం మాత్రమే జరిగాయి. ప్రభుత్వం 32శాతం పనులు లక్ష్యంగా పెట్టుకోగా సగం కూడా పూర్తి కాలేదు. కాంట్రాక్ట్ సంస్థలు అవసరమైన యంత్రాలు, కార్మికులను సమీకరించుకోవడంలో విఫలమయ్యాయి. పనుల్లో వేగం లేకపోవడం, రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాటి ప్రభావం మలివిడత భూసమీకరణపై పడింది. భూసమీకరణ మందకొడిగా సాగుతోంది. రెండోదశలో భాగంగా 16,666 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 4000 ఎకరాల వరకు మాత్రమే రైతులు అంగీకారం తెలిపారు. ఇంకా 12,600 ఎకరాలకు పైగా భూమి సమీకరణకు ఇవ్వాల్సి ఉంది.
రాజధాని రైతుల ప్రధాన సమస్యలివీ..
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన 29 గ్రామాల రైతులు ప్రస్తుతం పలు సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు.
గతంలో కేటాయించిన వీధిపోటు ప్లాట్ల మార్పు విషయంలో అధికారులు సృష్టించిన నిబంధనల వల్ల రైతులు నిత్యం సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. మౌలిక వసతులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి ప్రధాన కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు. సీఎం చంద్రబాబే బ్యాంకు అధికారులకు సూచించినా పరిస్థితిలో మార్పు లేదు.
అసైన్డ్ భూములకు సంబంధించిన వివాదం పూర్తిగా సమసిపోలేదు. పాత పట్టాల స్థానంలో అసైన్డ్ పదాన్ని తొలగించి కొత్త పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదు. దీంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అది రెండో విడత పూలింగ్ గ్రామాలకు విస్తరిస్తోంది.
భవన నిర్మాణాలు చకచకా
అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరుగుతోంది. ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగుల భవన సముదాయం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు 90 శాతానికి పైగా పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఎన్జీవో ఉద్యోగుల భవనాల నిర్మాణం 70 శాతం వరకూ పూర్తయింది. గడిచిన ఏడాదికాలంలో వీటి నిర్మాణ పనులు ఊహించని స్థాయిలో పురోగమించాయి. న్యాయమూర్తుల నివాస సముదాయాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. వీటిలో సగం భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి తుది దశ పనుల్లో ఉన్నాయి. మంత్రుల భవనాల నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయి. ఐకానిక్ సెక్రటేరియట్ భవనాల్లో జీఏడీ టవర్స్, సచివాలయ భవనాలు 1, 2, 3, 4 నిర్మాణ పనులు పునాదుల దశను దాటి 2, 3 అంతస్తుల వరకూ పూర్తయ్యాయి. ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి పైలింగ్ పనులు జరుగుతున్నాయి. హైకోర్టు భవనానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తై, నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.
రైతుల లే అవుట్ల పరిస్థితి ఇదీ...
అమరావతిలో రైతుల లే అవుట్ల పనులు మందగమనంతో సాగుతున్నాయి. మొత్తం 1ఏ నుంచి 12ఏ వరకూ 13 ఎల్‌పీఎస్ జోన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. రహదారులు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు(ఎస్‌టీపీ)లు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు, నీటి నిల్వ రిజర్వాయర్లు వంటివి చేపడుతున్నారు. 2027 మార్చి నాటికి లే అవుట్ల పనులను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనులు ఆ స్థాయిలో జరగడం లేదు. గడిచిన రెండేళ్లలో10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాకాలం వస్తే మళ్లీ పనులు చాలా వరకూ ఆగిపోతాయి.
మందకొడిగా రహదారుల పనులు
రాజధానిలో 1,270కి.మీ. మేర రహదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 34 ప్రధాన ట్రంక్‌రోడ్లు, ఈ1నుంచి ఈ16 వరకూ ఈస్ట్ కారిడార్లు, ఎన్1 నుంచి ఎన్18 వరకూ నార్త్ కారిడార్లు నిర్మిస్తున్నారు. ప్రధాన ఆర్టీరియల్, కలెక్టర్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్ల పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఫరవాలేదనిపించినా, ఆలస్యంగా మొదలుపెట్టారు. ఆ వెంటనే వర్షాలు ముంచేయడంతో గతేడాది పనులు ఆగిపోయాయి. గత నాలుగైదు నెలల్లోనే ఒకింత వేగంగా పనులు జరిగినా లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకంజలో ఉన్నాయి. మళ్లీ వర్షాకాలం ముంచుకొస్తోంది. ఇదేవేగంతో జరిగితే 2027 నాటికి ఎల్‌పీఎస్ ప్లాట్లు రైతులకు అప్పగించడం దాదాపుగా అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
