అమరావతి అభివృద్ధే సమాధానం.. జగన్ బ్యాచ్‌కు కౌంటర్ అదే: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:09 AM
అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తి స్థాయి కౌంటర్ ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్‌కూ అమరావతి త్వరలో సరైన సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.
రాజధాని నగరం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు
పెట్టుబడికి రెట్టింపు ఫలితాన్ని రాష్ట్రానికి ఇస్తుంది
ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్
ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50 వేల కోట్లు
అమరావతిపై ద్వేషంతోనే వైసీపీ విమర్శలు: సీఎం
అమరావతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తి స్థాయి కౌంటర్ ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్‌కూ అమరావతి త్వరలో సరైన సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అభివృద్ధి అనేదానికి ముగింపు ఉండదు. ఒక్కరితో ఆగదు. అభివృద్ధి నిరంతరం జరిగే ప్రక్రియ. హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కూడా అదే తరహాలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని, దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. హైదరాబాద్ వల్లే తెలంగాణ ఆ ఘనత సాధించగలిగిందని తెలిపారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దానిపై పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఫలితాన్ని రాష్ట్రానికి ఇస్తుందని అన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని తెలిసి కూడా వైసీపీ వారు విమర్శలు చేస్తున్నారంటే కేవలం వారికి అమరావతిపై ఉన్న ద్వేషమే కారణమన్నారు. రాజధానిలో ప్రస్తుతం 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం చేతిలో ఉందని, ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఎకరం రూ.10 కోట్లు వేసుకున్నా రూ.50 వేల కోట్లు చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో దాని ధర హైదరాబాద్‌లో మాదిరి ఎంత పెరుగుతుందో ఎవరూ చెప్పలేమని అన్నారు. అమరావతిపై కేవలం ద్వేషంతో విమర్శలు చేసే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
వారి నోటికి అడ్డూ అదుపూ లేదు
వైసీపీ నేతలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై దాడికి యత్నించడం.. ఎండీ రాధాకృష్ణపై నోరు పారేసుకోవడంపై చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ వాళ్ల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. వాళ్లు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడుతారని, ఎవరిపైనైనా దాడికి తెగబడతారని, ప్రజాస్వామ్యమన్నా, ప్రజలన్నా వారికి గౌరవం లేదని విమర్శించారు. వారి క్రిమినల్ ఆలోచనల ఫలితం ఏమిటో 2024 ఎన్నికల్లో కనిపించినా వారి తీరు మారలేదన్నారు. తీరు మారకుంటే భవిష్యత్తులో అంతకన్నా ఎక్కువ ఫలితాన్నే వారు అనుభవించాల్సి ఉంటుందని, ప్రజలు అన్నీ గమనిస్తుంటారని సీఎం వ్యాఖ్యానించారు.