Share News

నేటి నుంచి అమరావతే మాకు శాశ్వత చిరునామా

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:57 AM

రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం సంతోషంగా ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు జీ రామకృష్ణ అన్నారు.

నేటి నుంచి అమరావతే మాకు శాశ్వత చిరునామా

  • పాలనలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: అప్సా అధ్యక్షుడు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం సంతోషంగా ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు జీ రామకృష్ణ అన్నారు. ‘మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళానికి, ఆందోళనకు గురయ్యాం. అమరావతికి పార్లమెంటు చట్టబద్ధతతో ఇప్పటి నుంచి మాకు అమరావతే శాశ్వత చిరునామా. రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులను, సమస్యలను అర్థం చేసుకున్నాం. పరిపాలనలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం’ అని రామకృష్ణ పేర్కొన్నారు. అప్సా మాజీ అధ్యక్షుడు మురళీకృష్ణ సచివాలయంలో మాట్లాడుతూ, ‘గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. గత ఐదేళ్లుగా ఎక్కడికి వేళ్లాలో తెలియక ఉద్యోగులందరూ తీవ్ర మానసిక వేదను అనుభవించారు’ అని అన్నారు. సంస్థ కార్యదర్శి నాపా ప్రసాద్‌ మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంటులో ఆమోదించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంతోషంగా ఉందన్నారు. అప్సా మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మణ కుమారి మాట్లాడుతూ, మూడు రాజధానుల ప్రకటన రావడంతో ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. మహిళా ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు దుర్గాదేవి మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఖరారు కావడం ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి దక్కిన గొప్ప వరం అని పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 05:58 AM