అమరావతే శాశ్వత రాజధాని
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:12 AM
తరచూ మార్పు చేయకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేందుకు శాసనసభలో తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
భవిష్యత్‌లో రాజధానిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానానికి క్యాబినెట్ ఓకే
మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తరచూ మార్పు చేయకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేందుకు శాసనసభలో తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (2)లో ‘అమరావతి వద్ద’ అనే పదాన్ని చేర్చాలని, సెక్షన్ 5కు వివరణలో ‘మరియు అమరావతి అనగా, ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) చట్టం-2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి’ అనే పదాలను కలపాలని కూడా నిర్ణయించింది. ఇలా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు
హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం. 1,730 పోస్టులు కొత్తగా సృష్టించడానికి అనుమతి.
క్వారీ లీజుల్లో వడ్డెర సంఘాలకు ప్రీమియం మొత్తం, సీనరేజి ఫీజులో 50శాతం రాయితీ. 15శాతం క్వారీలు వడ్డెరలకే ఇస్తారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 50శాతం మేర మాఫీ.
ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వాడుకునే వినియోగదారులకుకూడా గ్యాస్‌సబ్సిడీ వర్తింపు.
ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ర్టేషన్, పర్యవేక్షణ కోసం ‘ఏపీ కోచింగ్ ఇనిస్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026 ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం.
గుంటూరు జిల్లా నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 60మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాలు నిర్మించేందుకు ఆమోదం.
కుప్పంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఇప్పటికే మంజూరైన పోస్టులకు అదనంగా పీఈటీ, స్టాఫ్ నర్స్ పోస్టులను గెస్ట్ బేసి్‌సలో, రికార్డు అసిస్టెంట్ పోస్టును ఔట్ సోర్సింగ్‌లో నియామకానికి ఆమోదం.
నెల్లూరుజిల్లా గంగవరంలో 14.32 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖకు బదలాయింపు. నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో 1.02 ఎకరాల ప్రభుత్వ భూమిని హాస్పటల్ స్థాపనకు మార్కెట్ విలువ రూ.33.15లక్షలకు ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు కేటాయింపు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ కంపెనీలకు లీజుకిచ్చిన భూములు మరో 30ఏళ్లపాటు కొనసాగింపు
నంద్యాలలోని నూనేపల్లిలో రెండెకరాల భూమిని టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరాకు, ఏడాదికి రూ.వెయ్యి చొప్పున లీజుకు కేటాయింపు.
కడప,కర్నూలు జిల్లాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రతి ఐదేళ్లకూ 10శాతం లీజు పెంపుతో 33ఏళ్ల లీజుకు ప్రభుత్వ భూముల కేటాయింపు.
పునరుత్పాదక ఇంధన జోన్లకు ఏపీసోలార్ పవర్ కార్పొరేషన్ బదులు నెడ్‌క్యా్‌పను నోడల్‌ఏజెన్సీ నియమిస్తూ జారీచేసిన జీవోకు ఆమోదం.
అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ పనులకు ఏపీసీపీడీసీఎల్ వసూలు చేసే చార్జీలు 15శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింపు.
సుజ్లాన్ ఎనర్జీ,ఆక్సిస్ ఎనర్జీ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి గడువు మరో రెండేళ్లపాటు పొడిగింపు.
ఆర్థిక శక్తిగా అమరావతి
సీఎం ఆశయమిదే: మంత్రి కొలుసు
ఆర్థిక శక్తిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి కొలుసు పార్థసారఽథి తెలిపారు. నిబంధనల ప్రకారమే రాజధానిపై చట్టసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. శాసనమండలిలో తీర్మానం చేస్తారా అని ప్రశ్నించగా, రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని మంత్రి తెలిపారు. 20 ఏళ్లు కూటమే ఉంటుందంటున్నారు కదా.. ఇంకెందుకు తీర్మానం అని ప్రశ్నించగా, 20 ఏళ్ల తర్వాతైనా ఎవరైనా వచ్చి మార్చకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు. ‘‘ఇప్పటికే సీఆర్‌డీఏ చట్టం ఉంది. అయినా, రాజకీయ కారణాలతో భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా రాజ్యాంగం, చట్టం ప్రకారం అదనపు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతే రాజధాని అని హైకోర్టు కూడా తేల్చి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రెండో దశ పూలింగ్ కోసం రైతులను నమ్మించడానికే తీర్మానం చేస్తున్నారా అని ప్రశ్నించగా, సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాజధాని ప్రాంతాన్ని విస్తరించవచ్చని, దానికోసం తీర్మానాలతో పని లేదని తెలిపారు. శాసనమండలిలో వైసీపీ బలం ఉన్నందునే, ఈసారి మండలి సమావేశం పెట్టట్లేదని వైసీపీ నేతలు అంటున్నారని ప్రస్తావించగా, ప్రశ్నించేందుకు వచ్చిన అవకాశాన్ని సైతం వైసీపీ వదులుకుంటున్నదని తెలిపారు. రాజధానిపై అప్పులు తెచ్చినందునే అమరావతిపై తీర్మానం చేస్తున్నారనే వైసీపీ నేతల విమర్శలపై స్పందిస్తూ.. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే సమాధానం చెబుతామన్నారు. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై విచారణకు ఆదేశించామని ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు.