Share News

అత్యాధునిక టెక్నాలజీతో అమరావతి పనులు

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:19 AM

రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరూ వినని అత్యాధునిక నిర్మాణ పద్ధతులకు వేదిక అవుతోంది. ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి అమరావతిలోని ...

అత్యాధునిక టెక్నాలజీతో అమరావతి పనులు

  • శరవేగంగా ఐకానిక్‌ భవన నిర్మాణం

  • ఫ్లైవుడ్‌, ఉడెన్‌ బీమ్‌ జంపింగ్‌ టెక్నాలజీతో సెక్రటేరియట్‌ టవర్‌ 2, 3 పనులు

  • సగటున పదిరోజుల్లో ఒక్కో అంతస్తు పూర్తి

  • 40 అంతస్తులు పూర్తయ్యాక ఒక్కోదానికి స్లాబ్‌

(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరూ వినని అత్యాధునిక నిర్మాణ పద్ధతులకు వేదిక అవుతోంది. ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి అమరావతిలోని ఐకానిక్‌ భవనాలను నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలోనే అమరావతి జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకూ సచివాలయ భవన సముదాయం అనగానే గుర్తొచ్చేది.. డయాగ్రిడ్‌ నిర్మాణ స్వరూపమే. అందమైన ఆ నిర్మాణ స్వరూపాన్ని గ్రాఫిక్స్‌ రూపంలో ప్రభుత్వం ప్రజలకు చూపించింది. ఇప్పుడు ఆ నిర్మాణంలో సెక్రటేరియట్‌ టవర్స్‌ 3, 4 పనులకు కొత్త టెక్నాలజీని వాడుతోంది. అదే.. ఫ్లైవుడ్‌, ఉడెన్‌ బీమ్‌ జంపింగ్‌ టెక్నాలజీ. మెరైన్‌ ప్లైవుడ్‌, ఉడెన్‌ బీమ్‌లను ఉపయోగించి నిర్మించే ఈ టెక్నాలజీ గురించి సివిల్‌ ఇంజనీరింగ్‌ నిపుణులకు తెలిసింది కూడా తక్కువే. ఇక సామాన్యుల విషయం చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన ఈ ఆధునిక విధానాన్ని, మన సంప్రదాయ విధానంతో జోడించి ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో ఒక్కో అంతస్తు నిర్మాణానికి సగటున 10 రోజులు పడుతుంది. నిర్మాణ సమయం 3 వంతులు తగ్గి, మూడు రెట్లు నిర్మాణ వేగం పెరుగుతుంది.


జంపింగ్‌ టెక్నాలజీ అంటే..

ఇప్పటి వరకూ అందరూ షీర్‌వాల్‌ టెక్నాలజీ గురించి వినుంటారు. జంపింగ్‌ టెక్నాలజీ అనేది దీనికి దగ్గరగా ఉంటుంది కానీ, అంతకంటే అత్యాధునికమైనది. షీర్‌వాల్‌ టెక్నాలజీలో భవనం గోడలు, స్లాబులకు మొత్తానికి కలిపి ప్లేట్లతో రెండువైపులా షట్టరింగ్‌ చేసుకుని, మధ్యలో స్టీల్‌, కాంక్రీట్‌తో కలిపి కాంపోజిట్‌ మిక్స్‌ నింపుతారు. తద్వారా ఒకేసారి గోడలు, స్లాబు పూర్తైపోతాయి. ఆ తరువాత ప్లేట్లను ఊడదీసి పైకి తీసుకువెళ్లి పూర్తయిన స్లాబుపై మరో అంతస్తుకు షట్టర్లు అమరుస్తారు. కానీ ప్రస్తుత జంపింగ్‌ టెక్నాలజీలో స్లాబు లేకుండా గోడలు మాత్రమే నిర్మించుకుంటూ వెళతారు. మెరైన్‌ ఫ్లైవుడ్‌ షట్టరింగ్‌, రైలుపట్టాల మాదిరిగా చెక్క బీమ్‌ల సహాయంతో ముందుగా గోడల కోసం షట్టర్లను నిర్మిస్తారు. మధ్యలో స్టీల్‌, కాంక్రీట్‌తో కలిపి కాంపోజిట్‌ మిక్స్‌ నింపి గోడలు పూర్తి చేస్తారు. గోడలు పూర్తయిన తరువాత మరో అంతస్తు కోసం షట్టర్లను అక్కడి నుంచి సులువుగా పైకి జరుపుతారు. షీర్‌వాల్‌ టెక్నాలజీలో స్లాబు అడ్డంగా ఉండడంతో ప్లేట్లన్నీ ఊడదీసి పైకి తీసుకెళ్లి మళ్లీ బిగించుకోవాలి. కానీ జంపింగ్‌ టెక్నాలజీలో ఒకసారి బిగిస్తే వాటినే పై వరకూ జరుపుకొంటూ వెళ్లిపోవచ్చు. షీర్‌వాల్‌ టెక్నాలజీలో ప్లేట్లు ఊడదీసి, మళ్లీ బిగించడానికి వారం రోజుల వరకూ పడుతుంది. కానీ జంపింగ్‌ టెక్నాలజీ పద్ధతిలో 3 గంటల్లోనే పైఅంతస్తుకు షట్టరింగ్‌ను జరుపుకొని స్టీల్‌, కాంక్రీట్‌ మిక్స్‌తో గోడలు కట్టేసుకోవచ్చు. ఇలా 40 అంతస్తులు ఉండే భవనాలను నిర్మిస్తున్నారు. ఆ తరువాత ఒక్కో అంతస్తుకు పాతకాలం మిద్దెలకు మాదిరిగా భారీ ఉడెన్‌ బీమ్‌లు వేసి వాటి పై డెక్‌ ఎంబైబ్‌ ప్లేట్లు అమర్చి స్లాబ్‌ వేస్తారు. షట్టరింగ్‌ను ఒక అంతస్తు నుంచి మరో అంతస్తు కు జరపడానికి పిస్టన్‌, రైలింగ్‌ టెక్నిక్‌ను వినియోగిస్తున్నారు. ముందుగా భవన నిర్మాణం చుట్టూ రైలింగ్‌లను అమరుస్తారు. వాటిని షట్టర్లకు అనుసంధానిస్తారు.

Updated Date - Jun 03 , 2026 | 04:19 AM