అమరజీవి స్ఫూర్తితో అమరావతి
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:31 AM
అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే అమరావతి రాజధాని కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని లేకుండా చేయాలని చూసిన నాటి వైసీపీ పాలకులపై రైతులు అమరజీవి స్ఫూర్తితో పోరాడి నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు.
ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
రైతుల త్యాగంతో రాజధానికి 33 వేల ఎకరాలు
పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రైతులు పోరాడి రాజధానిని నిలబెట్టుకున్నారు
మూడేళ్లలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి నిలుస్తుంది
దేశంలో ఏపీని నంబర్1గా నిలబెట్టడమే అమరజీవికి మనమిచ్చే ఘన నివాళి
ఆయన త్యాగాన్ని తెలుగు జాతి మరువరాదు
కోమటి, శెట్టి, గుప్తా, వైశ్య వంటి పేర్లు తీసేసి ఆర్య వైశ్య కులంగా జీవో తెస్తాం
58 అడుగుల ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు
గుంటూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే అమరావతి రాజధాని కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని లేకుండా చేయాలని చూసిన నాటి వైసీపీ పాలకులపై రైతులు అమరజీవి స్ఫూర్తితో పోరాడి నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. సోమవారం అమరావతి రాజధానిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫై్‌స(త్యాగ శిల్పం)ను సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి, అమరావతి రైతుల త్యాగానికి మధ్య సారూప్యత ఉందన్నారు. పొట్టి శ్రీరాములు కఠోరమైన దీక్ష, ప్రాణత్యాగంతో భాషాప్రయుక్త ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని చెప్పారు. అమరావతిలో 29 వేలమంది రైతులు త్యాగం చేసి 33 వేల ఎకరాల భూమిని ఇవ్వడంతో రాజధాని రూపుదిద్దుకుంటోందరు. అమరావతిని రాబోయే మూడేళ్లలో నిర్మించబోతున్నామని ప్రకటించారు.
ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, అలాగే తాము దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నంబరు 1 స్థానంలో నిలబెట్టి పొట్టి శ్రీరాములుకు ఘనమైన నివాళులు అర్పిస్తామని అన్నారు. ‘స్ఫూర్తికి మారు పేరు పొట్టి శ్రీరాములు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అందరివాడు. 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ అని పేరు పెట్టారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. మన దేశంలోని గుజరాత్‌కు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఏపీలో ఇక స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ చిరకాలం ఉంటుంది.
నాడు, నేడు తెలుగుజాతి పోరాటం
‘తెలుగు జాతి గతంలోనూ, ఇప్పుడూ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. రాజీ మార్గంలో ఆంధ్ర రాజధానిగా కర్నూలు, గుంటూరులో హైకోర్టు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేసుకుని తెలుగు జాతి మనుగడ సాగించింది. అనంతరం అమరావతి రాజధానిగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2019-24 మధ్యలో రాజధాని మూడు ముక్కలాటగా మారింది. మూడు రాజధానులన్నారు. అసలు రాజధానే లేని పరిస్థితి తెచ్చారు. రాజధానితో గత పాలకులు ఆటలాడటం బాధేసింది. ఇప్పుడు ప్రజా రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. తెలుగుజాతి వివిధ సమయాల్లో విడిపోయి ఉంది. వివిధ సందర్భాల్లో కలిసి ఉంది. తెలుగు జాతికి రెండు రాష్ర్టాలు ఉన్నాయి’ అని చంద్రబాబు అన్నారు.
రైతుల త్యాగం ఓ స్ఫూర్తి, చరిత్ర
‘2019-24 మధ్యలో రాజధాని రైతుల పోరాటం ఓ చరిత్ర. ప్రజలను భాగస్వాములను చేసి రాజధాని నిర్మాణం మొదలు పెట్టాం. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. 21 నెలల్లోనే మంచి ఫలితాలు సాధించేలా పాలన చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఇలాంటి ప్రాజెక్టును గత ప్రభుత్వంలో విధ్వంసం చేశారు.గోదావరి పుష్కరాలకంటే ముందే జాతికి అంకితమిస్తాం’ అని అన్నారు.
సగర్వంగా చెప్పుకొనేలా..
‘ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండడమే కాదు.. రాష్ర్టానికి రాజధాని కూడా ఉండాలి. నా రాజధాని అమరావతి అని తెలుగువారు గర్వంగా చెప్పుకొనేలా తీర్చిదిద్దుతాం. మూడేళ్లలో అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తామో మీరే చూస్తారు. కొం దరు కావాలని తప్పుడుప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అందరిది. ప్రతి ఒక్కరికీ న్యాయంచేస్తాం’ అని అన్నారు.
ఆర్యవైశ్యుల సెంటిమెంటును గౌరవించాం
‘గడచిన ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలాంటి స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దానధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్యవైశ్యులు. రూ.10 సంపాదిస్తే రూ.2 దానధర్మాలకు ఖర్చు చేస్తారు. అది వారి గొప్పతనం. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఆర్యవైశ్యులు అదే సంకల్పంతో ఏర్పాటు చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ఇటీవలే నిర్వహించాం. వాసవీ తల్లి పుట్టిన ప్రాంతం పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాం. ఆర్యవైశ్యుల సెంటిమెంటును గౌరవించాం. గుప్తా, శెట్టి, కోమటి, వైశ్య వంటి వేర్వేరు పేర్లు లేకుండా అందరిని ఆర్యవైశ్యులు అని పరిగణించేలా జీవో తెస్తాం. అభివృద్ధి-సంక్షేమం సమతూకంతో సుపరిపాలన సాగిస్తాం. హెల్తీ-వెల్దీ-హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అందరికీ న్యాయం చేయగలినప్పుడే పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి. ఆయన స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సీఎం అన్నారు.
ఉచిత వైద్యశాలకు 10 ఎకరాలు ఇవ్వండి
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ సీఎంకు ఓ ప్రతిపాదన నివేదించారు. జీఎంఆర్ సంస్థ తన సొంత నిధులతో ఉచిత వైద్యశాల ఏర్పాటుకు ముందుకొచ్చిందని, అమరావతిలో మరో 10 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. సభలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, సవిత, ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్, వసంత కృష్ణప్రసాద్, డూండీ రాకేశ్, టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు అనురాధ దేవకి, రేవతి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.