Share News

రాజధానిపై పక్కా కుట్రే

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:47 AM

రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలో భాగంగానే రాజధాని రైతులు, తాడేపల్లి సీఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది.

రాజధానిపై పక్కా కుట్రే

  • గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసినవారి దుస్సాహసమే!

  • వీడియో రుజువులు బయటపెట్టిన టీడీపీ

  • ఆధారాలు సంపాదించిన పోలీసులు

  • రైతులపై దండయాత్ర చేసిన వారిలో రౌడీ షీటర్‌ పానుగంటి చైతన్య కూడా

  • రాజధాని రైతులు, సీఐపై దాడి

  • ఘటనలపై రెండు వేర్వేరు కేసులు

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా

  • అంబటి రాంబాబుపైనా నమోదు

  • అరెస్టులకు పోలీసుల సన్నద్ధం!

గుంటూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలో భాగంగానే రాజధాని రైతులు, తాడేపల్లి సీఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. దండయాత్రకు దిగిన అల్లరి మూకలు, రౌడీ షీటర్లు.. గతంలో జగన్‌ ప్రభుత్వ హయాంలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసినవారే కావడం ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సంపాదించారు. నాటి దాడిలో పాల్గొన్న రౌడీ షీటర్‌ పానుగంటి చైతన్య సైతం శనివారం వైసీపీ నేతలతో ఉన్న వీడియోలను టీడీపీ కార్యాలయం కూడా ఆదివారం విడుదల చేసింది. దీంతో దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదయ్యాయి. రాజధాని అమరావతిలో పథకం ప్రకారం అలజడులు సృష్టించడానికి సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ ముసుగులో వీరు ఆ ప్రాంతంపై దండయాత్రకు బయల్దేరినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శనివారం ఉదయం అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాశ్‌, రౌడీషీటర్‌ పానుగంటి చైతన్యతో పాటు మరికొందరు ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా కార్ల్లలో పెనుమాక వైపు బయల్దేరారని తాడేపల్లి సీఐ పి.వీరేంద్రబాబుకు సమాచారం అందింది. ఆయన వెంటనే తన సిబ్బందితో ఉండవల్లిలోని సాయిబాబా ఆలయం ప్రాంతానికి వెళ్లారు.


అదే సమయంలో కొంతమంది టీడీపీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. టీడీపీ నేతలను చూసి వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30, 30ఏ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని.. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఐ, పోలీసులు వైసీపీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి హెచ్చరికలను ఖాతరుచేయకుండా అంబటి రాంబాబు ముందుకు దూసుకెళ్లి.. విధి నిర్వహణలో ఉన్న సీఐ వీరేంద్రబాబును చేతులతో నెట్టివేసి దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ అధికారి విధి నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించిన అంబటితో పాటు ఆ పార్టీ నాయకులపై వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు 223, 132 రెడ్‌ విత్‌ 3(5), బీఎన్‌ఎ్‌స 30, 30ఏ సెక్షన్ల కింద కేసు (క్రైం నంబర్‌ 413/26) నమోదు చేశారు.


దళిత రైతులపై దాడి..

రాజధాని ప్రాంత దళిత రైతులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వైసీపీ నాయకులపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌, బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని అమ్మ హోటల్‌ సెంటర్‌ వద్ద పెనుమాకకు చెందిన తెనాలి మాణిక్యం, జంగాల భవానితోపాటు మరికొందరు మహిళలు వేచి ఉండగా అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాశ్‌, రౌడీషీటర్‌ పానుగంటి చైతన్య, దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణమూర్తి, డైమండ్‌ బాబు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు వైసీపీ నాయకుల గుంపు చట్టవిరుద్ధంగా అక్కడకు కార్లలో వచ్చి రాజధానికి, అమరావతి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా భవానిని, రాయపూడి కిరణ్‌బాబును కులం పేరుతో దూషిస్తూ అవమానించారు. నిందితుల్లో కొందరు మాణిక్యం, భవాని, కిరణ్‌బాబుతో పాటు పలువురు మహిళల చేతులు, కాళ్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. మాణిక్యం ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన రౌడీషీటర్‌ పానుగంటి చైతన్య, డైమండ్‌ బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, వేమారెడ్డి, నవరత్నాల నారాయణ, మేకా శివారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డితోపాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు (412/26) నమోదు చేశారు. 189(3), 115(2), 118(1), 131, 79, 351(2), రెడ్‌విత్‌ 190 బీఎన్‌ఎస్‌ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3 (2), ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.


నాడు తెర వెనుక వారే!

నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌ తెరవెనుక కుట్రపన్నగా.. రౌడీషీటర్‌ పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో వైసీపీ రౌడీలు, అల్లరిమూకలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆ కేసులో పలువురు వైసీపీ నాయకులు వివిధ కోర్టుల్లో షరతులతో బెయిల్‌ పొందారు. మరోసారి అటువంటి దాడులు, అల్లర్లకు పాల్పడబోమని హామీ ఇచ్చి బయటకు వచ్చిన ఈ రౌడీ మూకలు.. తిరిగి రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు దాడికి దిగడం కుట్రలో భాగంగానే జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా కేసులో ఆయా వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు గతంలో వారు పొందిన షరతుల బెయిల్‌ను రద్దుచేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన అనేకమంది రౌడీషీటర్లు, మాజీ రౌడీషీటర్లపై తిరిగి రౌడీషీట్లు తెరవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పానుగంటి చైతన్య, రబ్బాని, చల్లా శివకోటి వంటి వారిపై తెరిచినట్లు తెలిసింది. చైతన్యపై విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి, దౌర్జన్యం తదితర ఘటనలపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - Jun 29 , 2026 | 06:16 AM