అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్!
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:12 AM
రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు డీపీఆర్‌ను...
కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. రూ.2,534 కోట్లతో నిర్మాణానికి రంగం సిద్ధం
గుంటూరు/తుళ్లూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి సీపీడబ్ల్యూడీ పంపింది. ఇందులో రూ.1,299.08 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించారు. కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.1,234.91 కోట్లు కేటాయించింది. సెంట్రల్ సెక్రటేరియట్‌లో కేంద్రప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ఉద్యోగుల కోసం అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర గృహ నిర్మాణశాఖ పంపిన ప్రతిపాదనకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సీఆర్డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. అందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుపై అధికారులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేశారు. మరోవైపు పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హడ్కో తెలిపింది. కాగా, అమరావతిలో కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (అకౌంటెంట్ జనరల్ కార్యాలయం) ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన లీజు అగ్రిమెంట్ బుధవారం మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయింది. ఈ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయపూడిలో 787 సెంట్ల భూమిని కాగ్‌కు కేటాయించింది. సంబంధిత అగ్రిమెంట్ పత్రాలను సీఆర్డీఏ ఎస్టేట్ విభాగ జేడీ జుబిన్ రాయ్, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) అధికారి ఆర్.శ్యామ్‌కు అందజేశారు.