అమరావతిలో అంబరాన్నంటిన సంబరం
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:52 AM
అమరావతికి చట్టబద్ధతతో సంబరాలు మిన్నంటాయి. జై అమరావతి.. జయహో ఆంధ్రప్రదేశ్ అంటూ, పచ్చ కండువాలు గాల్లో తిప్పుతూ రాజధానికి భూములిచ్చిన అన్నదాతలు...
శంకుస్థాపన ప్రాంతంలో సీఎం ప్రత్యేక పూజలు
సతీమణి భువనేశ్వరితో కలిసి జ్యోతి ప్రజ్వలన
తుళ్లూరు/గుంటూరు, ఏపిల్ర్ 2(ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధతతో సంబరాలు మిన్నంటాయి. జై అమరావతి.. జయహో ఆంధ్రప్రదేశ్ అంటూ, పచ్చ కండువాలు గాల్లో తిప్పుతూ రాజధానికి భూములిచ్చిన అన్నదాతలు, ఆడపడుచులు వేడుకలు చేసుకున్నారు. ఇందుకు అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలోని పవిత్ర భూమి వేదికైంది. గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాజధాని గ్రామాల నుంచి వేలాది మంది రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమ నేతలు ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కడున్న పవిత్రమైన నీరు-మట్టికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. పవిత్ర మట్టి, జలాలు ఉంచిన వేదికకు చంద్రబాబు సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జ్యోతిని తన సతీమణి భువవనేశ్వరితో కలసి వెలిగించారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా తన చేతి గాజులు తీసిచ్చిన సీఎం సతీమణి నారా భువనేశ్వరిని రైతులు, మహిళలు ఆప్యాయంగా పలకరించి, కృతజ్ఞతలు తెలిపారు. నాటి ఘటనలను ఆమెతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, సీఆర్‌డీఏ కమిషనర్ విజయరామరాజు, జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని సీఎం స్వయంగా పంచిపెట్టారు.