అమరావతిలో గణ..తంత్రం
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:13 AM
రాష్ట్ర రాజధాని అమరావతి తొట్టతొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయింది. రెట్టింపు జనంతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు
పోటెత్తిన ప్రజలు, రైతులు, విద్యార్థులు
గ్యాలరీలు సరిపోక బయటే నిలబడిన వైనం
స్ఫూర్తి నింపిన పోలీసు దళాల కవాతు
రాష్ట్రాభివృద్ధికి సూచికగా శకటాల ప్రదర్శన
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్
అమరావతిలో ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలకు విశేష స్పందన లభించింది. త్రివర్ణ పతాక రెపరెపలతో రాజధాని తళుకులీనింది. రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత సాధనకు ప్రభుత్వం సంకల్పించిన వేళ, ఈ ప్రయత్నాలను స్వాగతిస్తూ పెద్దఎత్తున రైతులు, విద్యార్థులు, ప్రజలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. కవాతులు స్ఫూర్తిని నింపితే, శకటాలు కనువిందు చేశాయి.
గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి తొట్టతొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయింది. రెట్టింపు జనంతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకూ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోనే గణతంత్ర వేడుకలు జరిగేవి. ఈసారి అమరావతిలోని రాయపూడిలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించింది. దీంతో రాజధాని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో రైతులు, సామాన్య ప్రజలు గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. వందల సంఖ్యలో విద్యార్థినీవిద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో అనుకున్న దానికంటే కూడా రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రక్షణ దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం పౌరులను ఉద్దేశించి సందేశాన్ని అందించారు. ఈ వేడుకల్లో కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్, సీఆర్పీఎఫ్, కేరళ రాష్ట్ర పోలీస్, విశాఖ ఏపీఎస్పీ 16వ బెటాలియన్, ఎన్‌సీసీ (బాలురు), ఎన్‌సీసీ (బాలికలు), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (బాల, బాలికలు), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బాల, బాలికలు), యూత్ రెడ్ క్రాస్ (బాలురు) కంటింజెంట్స్ కవాతును నిర్వహించారు. కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్‌కు మొదటి స్థానం, విశాఖ ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌కు రెండో స్థానం, కాన్సులేషన్ ప్రైజ్‌ను కేరళ పోలీస్ కంటింజెంట్‌కు అందించారు. పరేడ్‌లో ప్రధానంగా బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ఆహుతులను అలరించాయి. పరేడ్‌కు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ బి. రాజకుమారి నోడల్ మహిళా అధికారిగా, డీఐజీ కె.ఫకీరప్ప కో ఆర్డినేటింగ్ అధికారిగా వ్యవహరించారు.
వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ దంపతులు
గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు, మానవ వనరుల అభివృద్థి శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, హైకోర్టు న్యాయమూర్తులు,రాజకీయ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, గుంటూరు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్దసంఖ్యలో ప్రజ లు, విద్యార్థులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న ప్రగతి రథాలు
వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర అభివృద్థి, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక అవగాహన తదితర అంశాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు కనువిందు చేశాయి. వందేమాతరం- 150 సంవత్సరాల ఇతివృత్తంగా రూపొందించిన సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి వచ్చింది. ‘మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం’ అనే ఇతివృత్తంతో రూపొందిన సెర్ప్ శకటానికి ద్వితీయం, పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇతివృత్తంగా రూపొందిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ స్థానం లభించింది. వీటితోపాటు ‘జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృది’్థ- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖ, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ; ‘నైపుణ్యం, ఉపాధి’- స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ; ‘నీటి సంరక్షణ’ పర్యాటక శాఖ, జలవనరుల అభివృద్ధి శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖలు; ‘రైతు- వ్యవసాయ సాంకేతికత’- వ్యవసాయ శాఖ, మత్స్య శాఖలు, మౌలిక వసతులు- పెట్టుబడులు, సముద్ర, వైమానిక రంగాలు, సీఆర్డీఏలు; ‘ఖర్చు తగ్గింపు’- శక్తి, ఇంధనం నెడ్కాప్ (ఇంధనం); ‘ఉత్పత్తి పరిపూర్ణత’- చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ; ‘స్వచ్ఛ ఆంధ్ర’- పురపాలక- పట్టణాభివృద్ది శాఖ (స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, ఆర్టీజిఎస్ శాఖల శకటాలు ప్రభుత్వ సంకల్పం, ప్రజా సంక్షేమ లక్ష్యాలను ఆవిష్కరించాయి. ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ కళారూపాల మేళవింపుతో రూపొందిన శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పరేడ్ గ్రౌండ్ కిటకిట..
అమరావతిలో నిర్వహిస్తున్న తొలి గణతంత్ర వేడుకలు కావడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ భారీ ఏర్పాట్లు చేసింది. రాయపూడిలో 25 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో గ్యాలరీలను ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. దాదాపు 13వేల మంది వరకూ వేడుకల్లో భాగస్వాములు అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు అఽధికారులు చెప్పారు. అయితే, అంతకు మించిన స్థాయిలో ప్రజలు, ప్రధానంగా స్థానిక రైతులు, విద్యార్థినీవిద్యార్థులు, మహిళలు, యువకులు హాజరయ్యారు. ఈ కారణంగా పబ్లిక్ గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. కొంచం ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి వెళ్లేందుకు అవకాశం కూడా దక్కలేదు. దీంతో వారంతా బయటే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ ఏర్పాట్లు చేయడంతో రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు వాటిల్లలేదు.