Share News

రాజధాని పనుల వేగం పెంచాలి

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:49 AM

అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని తేల్చిచెప్పారు.

రాజధాని పనుల వేగం పెంచాలి

  • గ్రీన్‌ చానెల్‌ ద్వారా ఇసుక, గ్రావెల్‌ సరఫరా

  • మొత్తం 20 వేల మంది కార్మికులు, నిపుణులు

  • వారం, నెలవారీ టార్గెట్లతో పనిచేయండి

  • అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి: చంద్రబాబు

  • జాప్యం చేస్తున్న కాంట్రాక్టు సంస్థలపై సీఎం అసంతృప్తి

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని తేల్చిచెప్పారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాజధాని పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమావేశమయ్యారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఆ మేరకు పనులు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్‌ వర్క్‌గా భావించవద్దని, చరిత్రలో భాగస్వాములవుతున్నట్లు భావించాలని సూచించారు. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారని, కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదన్నారు. ప్రస్తుతం రూ.57,821 కోట్ల విలువైన పనులుండగా...వాటిలో రూ.50,943 కోట్ల పనులు గ్రౌండ్‌ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది.. లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారని పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేయగా.. మ్యాన్‌పవర్‌ విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలా మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లారని చెప్పగా.. స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్‌పవర్‌ ఎంత వరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు.


ఎంత మెషినరీని వినియోగిస్తున్నారని కూడా సీఎం ఆరా తీశారు. 5580 మెషినరీ అవసరముండగా, ప్రస్తుతం 3767 మెషినరీ ఉందని, ఇవి కాకుండా 16 హాట్‌మిక్స్‌, 36 వెట్‌మిక్స్‌, 34 ఆర్‌ఎంసీ మెషిన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వారం, నెలవారీగా టార్గెట్‌లు పెట్టుకుని పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వారానికి రూ.941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశముందని, ఈ లోగానే చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కువ ప్రాజెక్టులు చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. ప్యూచర్‌ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలన్నారు. నాణ్యత ఉండాలని, కాస్ట్‌ ఎఫెక్టివ్‌ చర్యలు తీసుకోవాలని, గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీ వంటివి వినియోగించుకోవాలని నిర్దేశించారు. రాజధాని ప్రతిష్ఠను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చన్నారు. నిర్మాణ సామగ్రికి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యమెందుకు?రాజధాని ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలను సీఎం ప్రస్తావించారు. నిర్మాణ సామగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్ట్‌ సంస్థలకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ సంస్థల నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టు సంస్థలు గానీ, అధికారులు గానీ తగిన రీతిలో స్పందించలేదంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలెర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా..ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, బురద చల్లేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నిర్మాణ సంస్థలు సమర్థులను ప్రాజెక్టు మేనేజర్లుగా నియమించుకోవాలని సూచించారు.


ఇసుక, గ్రావెల్‌ సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చూడండి..

రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్‌ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇసుక, గ్రావెల్‌ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఫారెస్ట్‌ అధికారుల కారణంగా గ్రావెల్‌ సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని పేర్కొన్నారు. ఫారెస్టు అధికారులతోనే అసలు సమస్య వస్తోందనే విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్‌ వంటివి గ్రీన్‌ చానెల్‌ ద్వారా వెళ్లాలని, ఎవరి ఒత్తిళ్లకూ గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఎన్జీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని ఉన్నతాధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ, ఏడీసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 03:51 AM