అమరావతి వెలుగులు!
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:38 AM
అమరావతి రాజధాని పనులు రేయింబవళ్లూ జరుగుతున్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో కార్మికులు పనులు చేస్తున్నారు.
ఐకానిక్ భవనాల నిర్మాణాల్లో వేగం
విద్యుత్ దీపాల వెలుగుల్లో రేయింబవళ్లూ జరుగుతున్న పనులు
ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి ఆరు అంతస్తులు పూర్తి!
హైకోర్టు నిర్మాణ పనులూ వేగిరం
గుంటూరు(రాజధాని), ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పనులు రేయింబవళ్లూ జరుగుతున్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో కార్మికులు పనులు చేస్తున్నారు. రాజధానిలో ఐకానిక్ భవన నిర్మాణాలపై ప్రభుత్వం, సీఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్ణీత గడువు పెట్టుకుని, పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలను సమాయత్తం చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలించడంతో నిర్మాణ సంస్థలు పనుల్లో వేగం పెంచాయి. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐకానిక్ భవనాలైన జీఏడీ టవర్, 4 హెచ్‌ఓడీ టవర్ల వద్ద భారీగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకొని.. పగలూ.. రాత్రీ అన్న తేడా లేకుండా పనులు చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు ఉండే భారీ క్రేన్లకు అమర్చిన విద్యుత్ దీపాలు జాతరలో ప్రభల మాదిరిగా ఆకాశంలో కాంతులు వెదజల్లుతున్నాయి. దీంతో రాజధాని పరిధిలోని అన్ని గ్రామాలకు ఆ వెలుగులు కనిపిస్తున్నాయి.
15 నాటికి ఫస్ట్ డైమండ్ సిద్ధం!
ఐకానిక్ సెక్రటేరియట్ టవర్లను డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ డయాగ్రిడ్ పిల్లర్ల మీద ఆధారపడి 40 నుంచి 50 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో కింద నుంచి పై వరకూ 7-9 డైమండ్లు వస్తాయి. ఏటవాలుగా నిర్మించే పిల్లర్లు రెండు ఒక చోట కలిసి మళ్లీ, విడిపోయి పక్కనే ఉన్న ఇంకో పిల్లర్‌తో కలుస్తాయి. మళ్లీ పైకి వెళ్లి రెండూ కలుస్తాయి. అలా డైమండ్ నిర్మాణంలో డయాగ్రిడ్ పిల్లర్లు పైకి లేస్తాయి. ఒక డైమండ్‌ను ఆధారం చేసుకుని 6 అంతస్తులు వేస్తారు. ఆగస్టు 15 నాటికి మొదటి 6 అంతస్తులను పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 4 పూర్తై 5వ అంతస్తు పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15కు మరో వారం రోజులే గడువు ఉండడంతో నిర్మాణ సంస్థలు పనుల వేగాన్ని పెంచాయి.
ఐకానిక్ హైకోర్టు పనుల్లో వేగం..
ఐకానిక్ హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫౌండేషన్ పనులు పూర్తికావడంతో కాంక్రీట్ గోడల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో వేగం పెంచేందుకు రాత్రి సమయాల్లోనూ పనిచేస్తున్నారు.