Share News

రాజధానిని మార్చాలన్న ఆలోచనే రాకూడదు

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:04 AM

భవిష్యత్తులో రాజధానిని మార్చాలన్న ఆలోచన ఎవ్వరూ చేయకూడదనే పకడ్బందీగా చట్టబద్ధత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

రాజధానిని మార్చాలన్న ఆలోచనే రాకూడదు

  • అందుకే పకడ్బందీగా చట్టబద్ధత

  • రేపు సభలో రాజధానిపై 4 గంటల చర్చ

  • మంత్రివర్గ సహచరులతో సీఎం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో రాజధానిని మార్చాలన్న ఆలోచన ఎవ్వరూ చేయకూడదనే పకడ్బందీగా చట్టబద్ధత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రి మండలి సమావేశం అజెండా ముగిసిన అనంతరం రాజధాని బిల్లుపై సహచరులతో సీఎం చర్చించారు. 2014లో గుంటూరు - విజయవాడ మధ్యలో రాజధాని అని పేర్కొన్నామని, ఈసారి రాజధాని సీఆర్డీయే పరిధిలోని అమరావతి అని స్పష్టంగా తీర్మానంలో పేర్కొని కేంద్రానికి పంపుతున్నామని సీఎం వివరించారు.2014లో రాజధానిని గుంటూరు- విజయవాడ మధ్య ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన జగన్‌, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో అమరావతిని ధ్వంసం చేయాలని చూశారన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సీఎం వివరించారు. ‘‘అమరావతి చట్టబద్ధతపై 2025 మే 8న క్యాబినెట్‌ ఆమోదించిన తీర్మానాన్ని మే 12న కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపాం. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలోనూ ఆమోదించి పంపాలని పీఎంవో సూచించింది. ఈమేరకు ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నాం. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్‌ 5ను సవరించి తీర్మానం చేయనున్నాం. సెక్షన్‌ 5లోని సబ్‌ సెక్షన్‌ 2లో కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చి సవరణ చేయనున్నాం. శనివారం అసెంబ్లీలో తీర్మానం చేసి అదే రోజు సాయంత్రం ఢిల్లీకి పంపుతాం. ఏప్రిల్‌ 1న జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో అమరావతి బిల్లుపై తీర్మానం చేస్తారని పీఎంవో తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి బిల్లు ప్రవేశపెడతారు. శనివారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సుమారు 4 గంటలపాటు అమరావతి తీర్మానంపై చర్చ నిర్వహించాలని నిర్ణయించాం’’అని తెలిపారు.


పవర్‌... పాయింట్‌ ప్రజంటేషన్‌

కూటమి ప్రభుత్వం తొలి నుంచీ విద్యుత్తు చార్జీలు పెంచబోమని చెబుతూ వచ్చిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క పైసా భారాన్ని కూడా ప్రజలపై మోపలేదని సీఎం తెలిపారు. విద్యుత్తు రంగాన్ని గాడిలో పెట్టే విషయంలో మన చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. పవర్‌పై 15 నిమిషాలపాటు ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. పంపిణీ నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెడితే ప్రజలకు మరింత మేలు చేయగలమన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఏప్రిల్‌ 5 (బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి) నుంచి ఏప్రిల్‌ 14 (అంబేడ్కర్‌ జయంతి) వరకు ఒక్కో నియోజకవర్గంలో రెండు వేల రూఫ్‌ టాప్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యుత్‌ నష్టాలను తగ్గించుకోవడంతోపాటు పీక్‌ అవర్స్‌లో గ్రిడ్‌పై భారాన్ని తగ్గించగలుగుతామన్నారు. రెండంకెల్లో ఉన్న విద్యుత్‌ నష్టాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్‌ డిజిట్‌కి తీసుకు వచ్చామని సీఎం వివరించారు.

నెల్లూరులో రాజకీయం చేయడం కాదు

  • మీ శాఖలో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి

  • మంత్రి నారాయణపై చంద్రబాబు సీరియస్‌

రాజధాని ప్రాంతంలో పదే పదే జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలను క్యాబినెట్‌ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణపై ఆయన సీరియస్‌ అయినట్టు తెలిసింది. ‘‘నెల్లూరులో కూర్చుని రాజకీయం చేయడం కాదు. సొంత శాఖలో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి. రాజధానిలో ఇప్పటివరకు మూడు సార్లు అగ్నిప్రమాదాలు జరిగితే, వాటి వెనుక ఎవరున్నారనేది ఎందుకు నిగ్గు తేల్చలేకపోతున్నారు? వైసీపీ వాళ్లు నేర రాజకీయాలు చేయడంలో ఆరి తేరారు. వారిని తేలిగ్గా తీసుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. తాజాగా జరిగిన ప్రమాదంలో కాలిపోయిన పైపులు 130 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలవు. వాటిని ఉద్దేశపూర్వకంగా తగలబెడితే తప్ప ప్రమాదం జరిగే అవకాశం లేదు. వెంటనే బాధ్యత తీసుకుని ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీకేం సంబంధం లేనట్టు కూర్చుంటేఎలా?’’ అని నారాయణను సీఎం ప్రశ్నించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు. రూ. కోట్ల సామగ్రి ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని సీఎం ప్రశ్నించారు. ఇప్పుడు పెడుతున్నామని నారాయణ సమాధానం ఇవ్వడంతో...ఇప్పుడు పెట్టడం ఏమిటని సీఎం మరోసారి సీరియస్‌ అయ్యారు.

Updated Date - Mar 27 , 2026 | 06:04 AM