Share News

అమరావతికి కేంద్ర సాయం 15 వేలకోట్లు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:34 AM

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేలకోట్లు, హడ్కో ద్వారా మరో రూ.11 వేలకోట్లు సమకూరుస్తున్నామని మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు.

అమరావతికి కేంద్ర సాయం 15 వేలకోట్లు

  • హడ్కో ద్వారా మరో రూ.11 వేలకోట్లు

  • 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం

  • ఐకానిక్‌ టవర్లపై వైసీపీ దుష్ప్రచారం

  • ఆరు నెలల్లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ

  • మంత్రి నారాయణ

కలెక్టరేట్‌ (కాకినాడ)/పిఠాపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేలకోట్లు, హడ్కో ద్వారా మరో రూ.11 వేలకోట్లు సమకూరుస్తున్నామని మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతితో అసెంబ్లీ, హైకోర్టు, ఐదు టవర్ల ఐకానిక్‌ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని, ప్రజలు పైకి వెళ్లి నగరం మొత్తాన్ని చూడవచ్చని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఉత్తమ అసెంబ్లీల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఐకానిక్‌ భవనాల రేట్లతో పోల్చితే ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్‌ భవనాల టెండర్లపై వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అమరావతి పనులు ఇక ఆపలేమని వైసీపీ నాయకులకు అర్థమైపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అమరావతి నిర్మాణం ముందుకు వెళ్లదని అనుకున్నారని, సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి వివిధ రూపాల్లో అమరావతి నిర్మాణాలకు నిధులు తీసుకొస్తున్నారని తెలిపారు. జూన్‌ నెలాఖరుకు రాష్ట్రంలో ఉన్న లెగసీ వ్యర్థాలు పూర్తిగా తొలగిస్తామని, దీనికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ యనమల దివ్య, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.


ఆరునెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు

రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు ఆరునెలల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. పిఠాపురం పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య పెంచాలని వినతులు వచ్చాయని, ప్రస్తుతం వీటి పెంపుపై కసరత్తు జరుగుతోందన్నారు. దీని వల్లే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో రూ.18 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.28 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. 128 పురపాలికల్లో వ్యర్థ జలాలను శుద్ధిచేసే ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Updated Date - Mar 24 , 2026 | 04:35 AM