Share News

రాజధానికి తొలి మెట్టు!.. ఇక అమరావతికి తిరుగు లేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:24 AM

రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మొదటి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

రాజధానికి తొలి మెట్టు!.. ఇక అమరావతికి తిరుగు లేదు: సీఎం చంద్రబాబు

  • సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంతో రాజధాని సాకారానికి శ్రీకారం

  • స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కిది తొలి విజయం

  • ఐదు కాన్సె్‌ప్టలతో దేశం మెచ్చేలా నిర్మిస్తాం

  • 2028లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం

  • గ్రాఫిక్స్‌ అన్నారు.. మూడు ముక్కలాట ఆడారు

  • రైతులు, సింగపూర్‌ ప్రతినిధులకూ వేధింపులు

  • అన్నింటినీ అధిగమించాం.. రాచబాట వేశాం

  • రాజధాని కోసం రైతులది త్యాగం కాదు.. స్ఫూర్తి

  • స్టీల్‌ బ్రిడ్జీలు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ప్రతినిధుల క్వార్టర్స్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయింది. రాజధాని కూడా లేకుండా పోయింది. 25 పార్లమెంట్‌ స్థానాలకు నడిమధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టాలని సంకల్పించాం. విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ముందుకొచ్చి భూములు ఇచ్చారు. రైతులది త్యాగం మాత్రమే కాదు..స్ఫూర్తి. ఈ వేదిక నుంచి వారందరికీ మరోసారి పాదాభివందనం చేస్తున్నా.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మొదటి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి వద్ద అమరావతిని విజయవాడ-మంగళగిరి-గుంటూరులతో అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఈ-3ని సీఎం ప్రారంభించారు. ఈ రహదారిని కలుపుతూ బకింగ్‌హామ్‌ కాలువపై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిలను కూడా ఆయన ప్రారంభించారు. దీనికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌లతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్‌కు లభించిన తొలి విజయంగా ఈ ఘట్టాన్ని అభివర్ణించారు. తెలుగుజాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నిర్మాణం చేపట్టామని, దీనికోసం అప్పట్లో 15 రోజులు అమెరికాలో గడిపానని గుర్తుచేశారు. తనపై నమ్మకంతో సింగపూర్‌... అమరావతి బృహత్‌ ప్రణాళికను ఉచితంగా ఇచ్చిందన్నారు. ‘‘గత పాలకులు ప్రజలతోపాటు సింగపూర్‌ ప్రతినిధులను కూడా వేధింపులకు గురిచేశారు.


ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయిస్తే.. వాటిని గ్రాఫిక్స్‌ అంటూ ఎగతాళి చేశారు. ఆ గ్రాఫిక్స్‌ నిజమవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తలలు దించుకునే పరిస్థితికి వచ్చారు’’ అని అన్నారు. రాజధాని కోసం 40 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి (జగన్‌ను ఉద్దేశించి).. తర్వాత 3రాజధానులంటూ మాట మార్చేశారని మండిపడ్డారు. ‘‘మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా 2019-24 మధ్య రైతులు చేసిన ఉద్యమాన్ని చరిత్ర మరిచిపోదు. అమరావతితో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కావాలన్నదే నా ఆకాంక్ష. అమరావతిని ఆహ్లాదకర నగరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


ఐదు కాన్సెప్టులతో రాజధాని....

‘‘అమరావతి రాజధానికి రాజమార్గం అందుబాటులోకి రావడం నగర నిర్మాణ ఘట్టంలో తొలి అడుగు. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది. అమరావతి పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్‌టెక్‌ క్యాపిటల్‌గా తయారుచేస్తున్నాం. నో పోల్స్‌, బ్లూ, గ్రీన్‌, గ్రీన్‌ ఎనర్జీ, క్వాంటం, డీప్‌టెక్‌ లాంటి ఐదు కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోంది. ఏఐ, క్వాంటం కంప్యూటర్‌ వ్యాలీగా అమరావతి మారుతోంది. టాప్‌ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుంది. అమరావతి, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలో ఉంటాయి. 190 కిమీ అవుటర్‌, 96 కిమీ ఇన్నర్‌ రింగురోడ్డు మంజూరుచేసిన కేంద్రానికి ధన్యవాదాలు. 2028 నాటికి భారత్‌ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఇక అమరావతిని ఎవరూ ఆపలేరు. రాజధానిలో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం..’’


సంకల్పం తీసుకుందాం..

‘‘2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నాం. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేతిలో జాతీయ జెండా, మనస్సులో అజెండాతో సాధించాల్సిన లక్ష్యాన్ని సంకల్పం చేయాలి. అనునిత్యం మీ సంకల్పాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు చేస్తే, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతాయి. మనకు స్వాతంత్య్రం ఎందుకొచ్చిందన్న అంశాన్ని అంతా మరచిపోతున్నారు. జెండా వందనంతో పాటు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా ఆలోచనలు చేయడం ముఖ్యం. ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థ పైనా జాతీయ జెండా ఎగరాలి. మండల, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలు చేయాలి. వచ్చే 21 ఏళ్లలో వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర కల సాకారం కావాలి. అమరావతి ఆర్థిక రాజధానిగా ఎదగాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పూర్తి చేసి రాకపోకలకు అనుగుణంగా, అద్భుతంగా తీర్చిదిద్దారంటూ మంత్రి నారాయణను అభినందించారు. ప్రత్యేకంగా ఆయన్ను పిలిచి.. ఆయనతో కలిసి ఆ రోడ్డుపై ఫొటో దిగారు. కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌, కొలికిపూడి శ్రీనివాసరావు, సీఆర్డీయే కమిషనర్‌ విజయరామరాజు, ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీపార్థసారథి, కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు, రాజధాని రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 06:07 AM