Share News

పగబట్టిన పాముల నుంచి రాజ్యాంగమే రక్ష!

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:10 AM

ఇది... అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరి. ఒకవైపు పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే ప్రక్రియ జరుగుతుండగా...

పగబట్టిన పాముల నుంచి రాజ్యాంగమే రక్ష!

  • రాజధాని రైతులు, పెట్టుబడిదారుల రక్షణకు చట్టం చేయాలి

  • ‘షెడ్యూలు 9’లో ఆ చట్టాన్ని చేర్చాలి

  • అప్పుడు ‘రివర్స్‌ సవరణ’ అసాధ్యం

  • 2/3 మెజారిటీతోనే సవరణ కుదిరేది

  • అనేక రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు అందులోనే

  • అమరావతినీ చేర్చితే శాశ్వతమైన ధీమా

  • రాష్ట్రానికి రాజ్యాంగ నిపుణుల సూచన

  • మీరు సవరిస్తే... నేను మళ్లీ సవరిస్తా! నేనొస్తే... రాజధానిని మళ్లీ మార్చేస్తా!

ఇది... అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరి. ఒకవైపు పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే ప్రక్రియ జరుగుతుండగా... మరోవైపు జగన్‌ మళ్లీ అమరావతిని అటకెక్కించడం పెద్ద కష్టమేమీ కాదనేలా మాట్లాడారు. ‘ఇప్పుడు మీరు సవరించారు. మేం అధికారంలోకి వస్తే... మళ్లీ రివర్స్‌ సవరణ చేయలేమా?’ అని ప్రశ్నించారు. నిజానికి... ‘అమరావతి’కి రక్షణ కల్పించే బిల్లుకు లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా మద్దతిచ్చింది. అంతేకాదు... అమరావతిని కేంద్ర నిధులతో భవ్యంగా నిర్మించాలని స్పష్టం చేసింది. వెరసి... ఎన్డీయే పోయి, ‘ఇండి’ కూటమి వచ్చినా... పార్లమెంటులో ‘రివర్స్‌’ సవరణ జరిగే అవకాశంలేదు. అయినప్పటికీ... అమరావతికి ‘జగన్‌ గండం’పై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే... ‘ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని’ అని పాతపాట పాడితే... అమరావతి కథ మళ్లీ మొదటికి వస్తుంది. అప్పుడు 35వేల మంది రైతులే కాదు, రాజధానిలో నివాస, వాణిజ్య, కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న వారందరి ప్రయోజనాలు దెబ్బతింటాయి. మరి... దీనికి విరుగుడే లేదా? అంటే... ‘నిక్షేపంగా ఉంది. అదే... రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు’ అని నిపుణులు చెబుతున్నారు.


ఇదే మార్గం...

‘అమరావతి’తో రాజధానికి భూములిచ్చిన 35వేల మంది రైతుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఇంకా ఇక్కడికి... పదులూ, వందల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు... ప్రైవేటు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలూ వస్తున్నాయి. అమరావతి పదిలంగా ఉంటేనే... రాజధాని రైతులకు, పెట్టుబడిదారులకు రక్ష! ఆ ధీమా కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉంది. దీనికి అనుగుణంగా.. రాజధాని ప్రాంత రైతులు, పెట్టుబడిదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలి. డిపాజిటర్ల రక్షణ చట్టం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం తరహాలో... రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, లబ్ధిదారులు, ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించేలా ‘రాజధాని ప్రాంత ప్రజలు, పెట్టుబడిదారుల రక్షణ చట్టం’ పకడ్బందీగా రూపొందించాలి. వీరి ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిబంధనలు పొందుపరచాలి. దీనిని... పార్లమెంటు ఆమోదిస్తున్న చట్టంతో కలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. అప్పుడు... ‘అమరావతి’ని కదిలించడం అసాధ్యం. ఎందుకంటే...

మూడింట రెండొంతులతోనే...

రాష్ట్ర చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం, ఒకసారి చేర్చిన తర్వాత సవరించడం అంత సులభం కాదు. దీనికి పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాల్సిందే. దేశంలోని అనేక రాష్ట్రాలు తమ ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్పించుకోగలిగాయి. అందులో అత్యధిక శాతం భూములు, రైతులు, కౌలుదారుల హక్కులకు సంబంధించినవే ఉన్నాయి. అంతెందుకు, సుప్రీం కోర్టు అనేక సందర్భాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. తమిళనాడు మాత్రం తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు 64 శాతానికి పెంచుకుని, ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్పించేసుకుంది. ఇది ప్రస్తుతం 9వ షెడ్యూల్‌లో ‘257ఏ’ గా నమోదై ఉంది. ఇలాగే ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంలో తమ పలుకుబడి, ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని తమకు సంబంధించిన చట్టాలకు 9వ షెడ్యూల్‌ ద్వారా రక్షణ పొందాయి. ఏపీకి సంబంధించిన 8 చట్టాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ల్యాండ్‌ సీలింగ్‌, కౌలుదారి, భూ సంస్కరణలు, షెడ్యూల్‌ ప్రాంతాల్లో భూ బదలాయింపు నియంత్రణ వంటి చట్టాలు ఇందులో ఉన్నాయి. ఇదే తరహాలో అమరావతి చట్టాలకు కూడా రక్షణ చట్రం బిగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి


ఇదే మంచి తరుణం...

ప్రస్తుతం కేంద్రంలో ‘కూటమి’కి మంచి బలముంది. అసెంబ్లీలో ‘అమరావతి ప్రాంత ప్రజలు, పెట్టుబడిదారుల రక్షణ చట్టం’ చేసి... దానిని షెడ్యూలు 9లో చేర్చడం చాలా సులువైన పని. ఎందుకంటే... అమరావతికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకే మాట! రెండు ప్రధాన పార్టీలూ దీనికి అనుకూలమే. అందువల్ల... ఉభయ సభల్లో 2/3 మెజారిటీతో సులువుగా దీనిని 9వ షెడ్యూలులో చేర్చవచ్చు. అంతేకాదు... రెండు ప్రధాన పక్షాలు అమరావతికి అనుకూలంగా ఉన్నందున ‘రివర్స్‌ సవరణ’కు మూడింట రెండు వంతుల మెజారిటీ రావడం భవిష్యత్తులోనూ అసాధ్యం. దీర్ఘకాలిక ప్రయోజనాలను, ‘రాజధాని శత్రువుల’ పన్నాగాలను దృష్టిలో పెట్టుకుని... ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 05:10 AM