అమ్మ దయతోనే అమరావతికి చట్టబద్ధత
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:18 AM
ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దయవల్లే పార్లమెంటు ఉభయసభల్లో రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు ఆమోదం లభించిందని అమరావతి రైతులు తెలిపారు.
దుర్గమ్మను దర్శించుకున్న రాజధాని రైతులు
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దయవల్లే పార్లమెంటు ఉభయసభల్లో రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు ఆమోదం లభించిందని అమరావతి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు దుర్గమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తాడేపల్లి కొండవీటివాగు ఆనకట్ట ప్రాంతం నుంచి పాదయాత్రగా దుర్గగుడికి బయలుదేరిన వారికి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వాగతం పలికారు. కొండపైన ఈవో వీకే శీనానాయక్, అర్చక బృందం వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తరువాత వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం చైర్మన్, ఈవో వారికి అమ్మవారి కుంకుమ, ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా పలువురు రాజధాని రైతులు మాట్లాడారు.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతి కోసం చేసిన పోరాటంలో మేం అనేక అవమానాలకు గురయ్యాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి కోసం దుర్గమ్మను దర్శించుకున్నాం. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదం పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాం.’
- ధనేకుల జ్యోతి
దుర్గమ్మ వెన్నంటి నడిపించింది
‘వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో రాజధాని కోసం చేసిన పోరాటంలో మేం అనేక అవమానాలను ఎదుర్కొన్నాం. పోలీసు లాఠీ దెబ్బలూ తిన్నాం. ఆనాడు దుర్గమ్మను దర్శించుకోవటానికి వస్తే మమ్ములను అడ్డుకున్నారు. దుర్గమ్మ మా పోరాటాన్ని వెన్నంటి నడిపించింది. రాజధానికి పార్లమెంట్‌లో చట్టబద్దత లభించటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం.’
- కొమ్మినేని వరలక్ష్మి
రాక్షస పాలన అంతమైంది
‘ఐదేళ్ల రాక్షస పాలన అంతమై ప్రజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దుర్గమ్మ దయతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రాజధాని అమరావతికి చట్టబద్దత లభించింది.’
- నూతక్కి శివకుమారి.