Share News

ఆమోదం ‘సంపూర్ణం’

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:03 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

ఆమోదం ‘సంపూర్ణం’

  • రాజ్యసభలోనూ అమరావతి బిల్లుకు ఓకే

  • రాష్ట్ర రాజధాని ఇక చట్టబద్ధం

  • రాష్ట్రపతి ఆమోదమే తరువాయి!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగానే చట్టరూపం దాల్చనుంది. బుధవారం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లును.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుంచారు. రెండున్నర గంటలకు పైగా దీనిపై చర్చించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, పాలక బీజేపీతోపాటు 11 రాజకీయ పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు చర్చలో పాలుపంచుకున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీల సభ్యులూ సంపూర్ణంగా బిల్లును సమర్థించారు. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యాంగంలో రాజధాని అన్న మాట ఎక్కుడుందని ప్రశ్నిస్తూ వాకౌట్‌ చేసింది. రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఈ ఘట్టాన్ని రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని స్వయంగా తిలకించారు. ప్రఽధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌తో పాటు పలు పార్టీల ఎంపీలను ఆయన స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.


ఏకగ్రీవ ఆమోదం..

రాష్ట్ర పునర్విభజన చట్టంపై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న జరిగిన చర్చలో అప్పటి బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడుసహా పలువురు నేతలు భావోద్వేగంతో పాల్గొన్న నాటి దృశ్యాలకు భిన్నంగా.. గురువారం వైసీపీ తప్ప అన్ని పార్టీల ఎంపీలూ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. టీడీపీ తరఫున కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌బాబు ప్రసంగించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్‌ మూడు రాజధానుల అంశం లేవనెత్తారని.. నిర్మాణలో ఉన్న అమరావతిని పద్ధతి ప్రకారం విధ్వంసం చేశారని రామ్మోహన్‌ నిప్పులు చెరిగారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం రాజఽఽధాని రైతుల విజయమని కాంగ్రెస్‌ తరఫున మాట్లాడిన ఏకైక ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి అమరావతిని సమర్థించగా.. మోదీ ‘వికసిత్‌ భారత్‌’ సంకల్పం వల్లే వికసిత్‌ ఆంధ్ర నిర్మాణం సాకారమవుతోందని, రాజధాని కోసం పోరాడిన మహిళలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ ఎంపీలు పాకా వెంకట సత్యనారాయణ, ఆర్‌. కృష్ణయ్య(ఏపీ), శంభు శరణ్‌ పాటిల్‌ (బిహార్‌) కూడా మాట్లాడారు. ఇదే సందర్భంగా కాళేశ్వరం అంశంపై బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌పై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని సురేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆర్థిక వనరుగా మారిందన్నారు.


పలువురు ఎంపీల మద్దతు..

చర్చలో పాల్గొన్న ఎంపీలు నదీముల్‌ హక్‌ (టీఎంసీ), సందీప్‌ పాఠక్‌, సంజయ్‌సింగ్‌ (ఆప్‌), సంజయ్‌ యాదవ్‌, మనోజ్‌కుమార్‌ ఝా (ఆర్‌జేడీ), సంజయకుమార్‌ ఝా(జేడీయూ), ప్రియాంక చతుర్వేది (ఉద్ధవ్‌ శివసేన), నిరంజన్‌ బిషి (బీజేడీ).. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. బిహార్లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ.. కేంద్రంలో బీజేపీకి విశ్వసనీయ మిత్రపక్షాలని సంజయ్‌కుమార్‌ ఝా అన్నారు. తమ నాయకుడు నితీశ్‌కుమార్‌ నేతృత్వంలో బిహార్‌ ఎంతో అభివృద్ధి చెందిందని.. అదే విధంగా చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. నితీశ్‌, చంద్రబాబు నాడు వాజపేయికి, నేడు మోదీకి బలమైన మద్దతు అందిస్తున్నారని చెప్పారు. అమరావతి ఉత్తమ రాజధానిగా నిర్మితం కావాలని కోరుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. రాజఽఽధానికి చట్టబద్ధత అంశం.. ఏపీ ప్రజలకు భావోద్వేగ ఘట్టమని, అందుకే మొత్తం టీడీపీ నేతలంతా గ్యాలరీలో కూర్చుని ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నారని లోకేశ్‌ తదితరులను ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. ఏపీకి రాజధాని నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే బిహార్‌కు ఏం దక్కిందని సంజయ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. గత రెండేళ్లలో టీడీపీ కేంద్రం నుంచి రూ.2 లక్షల కోట్ల మేరకు ప్రాజెక్టులను సాఽధించడమే గాక ఇవాళ రాజధానికి కూడా కేంద్రం మద్దతును పొందిందని.. కానీ నితీశ్‌ కుమార్‌ ఏమీ సాఽఽధించలేదని విమర్శించారు. అమరావతి విషయంలో ఆంరఽధప్రదేశ్‌ను అభినందిస్తూనే.. సీఎం నితీశ్‌కుమార్‌ విషయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని తృణమూల్‌ ఎంపీ హక్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ వాడుకుని వదిలేసే విధానం అనుసరిస్తోందన్నారు. జగన్‌ మూడు రాజధానుల అంశం లేవనెత్తినప్పుడు కేంద్రం ఎందుకు మౌనం పాటించిందని ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ప్రశ్నించారు. ఈ 12 ఏళ్ల అస్థిరత వెనుక రాజకీయాలున్నాయన్నారు. బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని మరో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ టీడీపీకి సూచించారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

Updated Date - Apr 03 , 2026 | 07:06 AM