అమరావతి శక్తి ఇదీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:32 AM
అమరావతిలో ఏదో మ్యాజిక్, శక్తీ ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించగలిగామని చెప్పారు.
క్వాంటమ్ కల సాకారంతో మరో చరిత్ర
రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించాం
స్వదేశీ హార్డ్‌వేర్‌ను అందించే సత్తా రాష్ట్రానికి ఉంది
టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్‌గా అమరావతి
తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ
హార్డ్‌వేర్‌ను ధ్రువీకరించే సామర్థ్యం వచ్చింది
క్వాంటమ్‌లో 45 లక్షల మందికి శిక్షణ ఇస్తాం
టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్ నిర్మిస్తున్నాం
ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి: సీఎం
ఎస్‌ఆర్‌ఎం, మేధా టవర్స్‌లో టెస్ట్ బెడ్స్ ప్రారంభం
2 క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు జాతికి అంకితం
ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానం. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సాధికారత సాధించుకున్న దేశాలే భవిష్యత్తులో ముందుకు వెళతాయి. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధ వంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఏదో మ్యాజిక్, శక్తీ ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించగలిగామని చెప్పారు. ప్రపంచానికి క్వాంటమ్ హార్డ్‌వేర్‌ను అందించే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని నిరూపితమైందన్నారు. క్వాంటమ్ కంప్యూటర్‌లను తయారు చేయాలన్న కలను సాకారం చేసి చరిత్ర సృష్టించామన్నారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీని మంగళవారం పరిశీలించారు. క్వాంటమ్ టెస్టింగ్ మెషీన్‌ను స్పృశించి ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వన్-ఎస్ క్వాంటమ్ టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. అనంతరం గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన వన్-క్యూ టెస్ట్ బెడ్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించి ఈ రెండు అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, వరల్డ్ క్వాంటమ్ డేను పురస్కరించుకుని దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్‌ల ప్రారంభంతో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్‌గా మారుతుందన్నారు. రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోట ఎలా ఉందో.. క్వాంటమ్ లాంచ్ ప్యాడ్‌కు అమరావతి కేంద్రంగా ఉంటుందని చెప్పారు. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానమన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సాధికారత సాధించుకున్న దేశాలే భవిష్యత్తులో ముందుకు వెళతాయని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ టెస్ట్ బెడ్‌లు
క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయాలని, దానికి అవసరమయ్యే హార్డ్‌వేర్ ఇక్కడే తయారు కావాలని పరిశోధకులకు తాను ఇచ్చిన పిలుపు వాస్తవరూపం దాల్చిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పుణెలోని డీఆర్‌డీవో సహా వివిధ సంస్థల భాగస్వామ్యంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్‌లు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగానే ఈ రెండు టెస్ట్ బెడ్‌లు తయారయ్యాయని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో రూపొందించుకున్న పది సూత్రాల్లో డీప్ టెక్ ఒక కీలకమైన అంశమని గుర్తుచేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా నిర్మితమైన తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌తో ఈ ఫెసిలిటీ కలిగిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ టెస్ట్ బెడ్‌ల ద్వారా క్వాంటమ్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, ధ్రువీకరించే సామర్థ్యం అమరావతికి వచ్చిందని సీఎం తెలిపారు. పరిశోధకులు, విద్యార్థులకు ఈ టెస్ట్ బెడ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం
అమరావతిని కాలుష్యరహితమైన గ్రీన్ సిటీగా, నెట్ జీరో కాన్సెప్టుతో నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్, విశాఖలో మెడ్‌టెక్, అనంతపురంలో సెమీ కండక్టర్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్‌కు 28న శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా స్టార్ట్‌పలను పెంచాలన్న ఉద్దేశంతో ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
క్వాంటమ్‌తో ఎన్నో ఉపయోగాలు
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో 45లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటమ్ మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నామని అన్నారు. క్యాంటమ్ టెక్నాలజీతో వ్యక్తిగత ఆరోగ్యం, వైద్యసేవల నుంచి క్రయోజెనిక్స్ దాకా వినూత్న పరిశోధనలకు వీలుంటుందని, కొత్త ఆవిష్కరణలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫ్యాబ్రికేషన్, యాంప్లిఫైడ్ రీసెర్చ్‌కు క్వాంటమ్ దోహదపడుతుందన్నారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా జరిగే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పులు, పంటల పరిస్థితిపై విస్తృతంగా అధ్యయనం చేసేందుకు క్వాంటమ్‌తో వీలు పడుతుందని సీఎం చెప్పారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, డీఆర్డీవో డీజీ ఆర్టీ ప్రసాద్, క్యూబిట్ ఫోర్స్ ఫౌండర్ ఎల్. వెంకట సుబ్రహ్మణియన్, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వీసీ సతీశ్‌కుమార్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి, ఐఐటీ తిరుపతి ప్రతినిధులు, క్యూబిట్ ఎండీ పృథ్వీ, ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
క్వాంటమ్ నిపుణులను సిద్ధం చేసుకోవాలి: అజయ్ సూద్
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో స్వయం సమృద్ధి సాధించేందుకు అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు దోఽహదపడతాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారు అజయ్ కుమార్ సూద్ అభిప్రాయపడ్డారు. ఈ ఫెసిలిటీస్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. క్వాంటమ్‌లో నైపుణ్యం కలిగిన యువతను పెంచుకోవాలని సూచించారు. అమరావతి ఏఐ, క్వాంటమ్ హబ్‌గా మారుతుందన్నారు. చంద్రబాబును డైనమిక్ లీడర్‌గా పేర్కొన్న ఆయన.. క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన చొరవను అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
క్వాంటమ్‌తో దేశానికి ఏపీ బలమైన సందేశం: అభయ్ కరాండికర్
మంగళగిరి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు, ప్రగతి వేగంగా సాధించే అవకాశం కలుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్ అన్నారు. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్లను తయారు చేయడం ద్వారా దేశానికి ఏపీ బలమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు. సాంకేతిక సార్వభౌమ దేశంగా, వికసిత్ భారత్‌గా మార్చడంలో ఇదో కీలక ముందడుగన్నారు. ఇప్పటివరకు ఐటీని ప్రోత్సహించిన చంద్రబాబు.. ఇపుడు డీప్‌టెక్ రంగంలోనూ ముందడుగు వేయడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్‌లను తయారుచేసి డీప్ టెక్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను రూపొందించారని అభినందించారు. క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ, సర్టిఫికేషన్‌లో ఇదో బెంచ్ మార్కుగా నిలుస్తుందన్నారు. హార్డ్‌వేర్ టెస్టింగ్ మాత్రమే కాకుండా, నూతన ఆవిష్కరణలు కూడా మరిన్ని అమరావతికి రావాలని ఆకాంక్షించారు. క్వాంటమ్ నిపుణులను తయారుచేయడంలో కూడా ఏపీ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ క్వాంటమ్ మిషన్ ద్వారా ప్రైవేటురంగంలో చేపట్టే పరిశోధనలకు కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా కరాండికర్ హామీ ఇచ్చారు.