Share News

Amaravati Avakai Festival: ఆవకాయ్‌ పిలుస్తోంది..రారండోయ్‌!

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:59 AM

తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ వేదికగా అమరావతి ఆవకాయ్‌ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి

Amaravati Avakai Festival: ఆవకాయ్‌ పిలుస్తోంది..రారండోయ్‌!

విజయవాడ/అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ వేదికగా అమరావతి ఆవకాయ్‌ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌ వర్క్‌ ఆర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల పాటు పున్నమి ఘాట్‌, భవానీ ఐల్యాండ్‌లో వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పటంతో పాటు మన భాషలోని గొప్పదనం, ఘనమైన సాహిత్యం, తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన సినిమాల గురించి ఈ సందర్భంగా చర్చించనున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆవకాయ్‌ ఫెస్టివల్‌కు రూపకల్పన చేశారు. నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనల గుబాళింపులపై ఉద్దండులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్‌ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతో పాటు బుర్ర కథలు, కూచిపూడి నాట్యం వంటి వాటిపైనా చర్చలు జరుగుతాయి. రచయితలు, చిత్ర నిర్మాతలు, సంగీతకారులు, కళాకారులతో ఇంటరాక్టివ్‌ సెషన్లు ఉంటాయి. వీటితో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 8వ తేదీ రాత్రి 7.50 గంటల నుంచి 8.20 గంటల వరకు కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్‌ దగ్గర జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, యూరోపియన్‌ యూనియన్‌ రాయబారి హెచ్‌ఈ హెర్వే డెల్ఫిన్‌ పాల్గొంటారు.

రెండో రోజు షెడ్యూల్‌...

9వ తేదీ ఉదయం 11గంటలకు ‘ప్యూర్‌ ఈవిల్‌: సినిమాల్లో ప్రతినాయకులు’ అంశంపై బాలీవుడ్‌ రైటర్‌ బాలాజీ విట్టల్‌తో ఎస్‌ హుస్సేన్‌ జైదీ, యండమూరి వీరేంద్రనాథ్‌, సుధీర్‌ మిశ్రా సంభాషణ. మధ్యాహ్నం 12- 12.50గంటల వరకు కథ చెప్పే విధానంలో పరిణామం: భారతీయ పురాణాల ప్రయాణంపై బ్నిం, కస్తూరి మురళీకృష్ణ, సంజీవ్‌ పస్రిచా, మొతాలీ అనురాధ సంభాషణ. మధ్యాహ్నం 1- 1.50 వరకు కథా కాలక్షేపం: స్టోరీ అవర్‌.. యూకే బృందం సంగీతం, మాటలతో సార్వత్రిక కథలు మధ్యాహ్నం 2.30- 3.20 వరకు ‘ఓటీటీ యుగంలో సినిమా’పై లీనా యాదవ్‌, శుభాశిష్‌ సర్కార్‌, సౌగుట ముఖర్జీ, సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ చైనాన్ని, శ్రీరూపా మిత్ర సమావేశం. మధ్యాహ్నం 3.20- 4.20వరకు ‘అభిలాష-నవల నుంచి సినిమా వరకు’.. వల్లి పద్మాంజలితో యండమూరి వీరేంద్రనాథ్‌, ఎ. కోదండరామిరెడ్డి సంభాషణ. సాయంత్రం 5గంటలకు చందన బాలకల్యాణ్‌ కర్నాటిక్‌- ఆధ్మాత్మిక సంగీత కచేరీ. సాయంత్రం 6.15 నుంచి 6.45 వరకు నాటకీ కథలు- ‘రస’ఐక్యం.. వనశ్రీరావు కూచిపూడి నృత్యం. సాయంత్రం 7- 7.50వరకు కథల శబ్దం: సినిమాలలో సంగీతం, కవిత్వం శ్యామ్‌ రక్షంద్‌ జలీల్‌తో ప్రియా సారయ్య, శేఖర్‌ రావ్జ్యాని, కాసర్ల సంభాషణ. రాత్రి 8- 9.45 గంటల వరకూకు మెహ్ఫిల్‌ ఏ సుఖాన్‌: అనుభూతినిచ్చే ముషైరా, రాత్రి 10- 11.30గంటల వరకు ఆజ్‌ రంగ్‌ హై ఏజీవీ- నిజామీ బంధు సంగీత విభావరి.


మూడో రోజు..

10వ తేదీ ఉదయం 11గంటలకు కథా కాలక్షేపం- స్టోరీ అవర్‌, యూకే సంగీతం, మాటలతో సార్వత్రిక కథలు. మధ్యాహ్నం 12- 12.50 వరకు ‘నీటిపై రాతలు- తెలుగులో కథ చెప్పే కళ’పై శ్రీకరుణతో బ్నిం, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి సంభాషణ. మధ్యాహ్నం 1- 1.50 వరకు ‘శుక్రవారం విడుదల సినిమా- పాత్రికేయవృత్తి’పై చల్లా భాగ్యలక్ష్మితో వర ముళ్ళపూడి, వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ సంభాషణ. మధ్యాహ్నం 2.30 నుంచి 3.20 వరకు ‘సుందరమైన తెలుగు- సాహిత్యం- సినిమా వైభవం’పై మొతాలీ అనురాధతో కస్తూరి మురళీకృష్ణ, మామిడి హరికృష్ణ, మౌనశ్రీ మల్లిక్‌ శ్రీపతిశర్మ వేదాంతంల సంభాషణ. మధ్యాహ్నం 3.30నుంచి ‘అనువాద కళ: పదాలకు సరిహద్దులు లేవు’ అంశంపై కె.శ్రీనివాసరావు, ఆచార్య జయప్రద, ఆచార్య తడకమళ్ళ విజయ్‌కుమార్‌, మరియా పూరి సంభాషణ. సాయంత్రం 5.45కు ‘నటసార్వభౌమ ఎన్టీఆర్‌: నట విశ్వరూపానికి నివాళులు’. రాత్రి 8గంటలకు ఉత్సవ ముగింపు.

సాహిత్య, కళల వైభవాన్ని చాటుదాం..

తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా, తెలుగువారి సంప్రదాయానికి, రుచికి నిలువుటద్దమైన ఆవకాయను విశ్వవ్యాప్తం చేస్తూ పర్యాటక శాఖ నిర్వహించే ‘అమరావతి ఆవకాయ్‌ ఫెస్టివల్‌’కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. సాంస్కృతిక మార్పిడికి, కళాత్మకమైన భాగస్వామ్యానికి ఒక శక్తిమంతమైన గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దే క్రమంలో మూడు రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలవనున్నాయని చెప్పారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, మన సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ వేడుకను విజయవంతం చేయాలని ఆమ్రపాలి కోరారు.

Updated Date - Jan 07 , 2026 | 02:59 AM