అసెంబ్లీలో చేనేత సందడి
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:23 AM
కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అమరావతి అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గురువారం 12 చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసింది.
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న
కొనుగోలు చేసిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తొలిరోజు బోణీ అదిరిందన్న మంత్రి సవిత
రూ.10 లక్షల చేనేత వస్త్రాల అమ్మకం
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అమరావతి అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గురువారం 12 చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టాళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన, ప్రపంచ గుర్తింపు పొందిన చేనేత దుస్తుల విక్రయాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, చేనేత మంత్రి సవిత, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం చేనేత క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చేనేత దుస్తులు ధరించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ క్యాడర్‌కు రోల్ మోడల్‌గా నిలవాలన్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న చేనేత చీరలు, షర్ట్‌లు, మోదీ జాకెట్ల కొనుగోలుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుచరులు, అధికారులు ఆసక్తి చూపారు. స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చీరలు, షర్ట్ మెటీరియల్ కొనుగోలు చేశారు. చేనేత వస్త్రాల కొనుగోలుకు విశేష స్పందన లభించడంతో నేతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు రూ.10 లక్షల వరకూ అమ్మకాలు జరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. మొదటి రోజు బోణీ అదిరిందని, మరో ఆరు రోజులపాటు ఈ స్టాళ్లు నిర్వహిస్తామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల విలువైన చీరలు కొన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.