Share News

అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్లకు 6 కమిటీలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:30 AM

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ తరహాలో అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మరో 2 ఎకనమిక్‌ రీజియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్లకు  6 కమిటీలు

  • అభివృద్ధి, ప్రణాళికలు, అమలు కోసం ఏర్పాటు

  • సీఎం అధ్యక్షతన 2 స్టీరింగ్‌ కమిటీలు

  • సీఎస్‌ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు

  • ఆయా రీజియన్ల సీఈవోల సారథ్యంలో మరో 2 అమలు కమిటీలు

  • సభ్యులుగా మంత్రులు, అధికారులు

  • విశాఖ రీజియన్‌ తరహాలో మాస్టర్‌ ప్లాన్లు

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ తరహాలో అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మరో 2 ఎకనమిక్‌ రీజియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రెండు రీజియన్ల అభివృద్ధి, ప్రణాళికలు, అమలు కోసం ప్రభుత్వం 6 కమిటీలు ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండు స్టీరింగ్‌ కమిటీలకు సీఎం, రెండు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలకు సీఎస్‌, రెండు అమలు కమిటీలకు ఆయా రీజియన్ల సీఈవోలు అధ్యక్షత వహిస్తారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌తో కలిసి ప్రణాళికలు రూపొందించింది. బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తం 10 జిల్లాలు ఈ రీజియన్‌ పరిధిలో ఉన్నాయి. గత ఏడాది నవంబరు 13న సీఎం దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్‌ గుర్తించిన 4 పైలట్‌ గ్రోత్‌ హబ్‌ల్లో విశాఖ రీజియన్‌ కూడా ఉంది. కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధిని రాష్ట్రమంతా విస్తరింపచేయాలనే లక్ష్యంతో అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మరో 2 ఎకనమిక్‌ రీజియన్లు ఏర్పాటు చేస్తోంది. విజన్‌ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను గ్లోబల్‌ ఎకనమిక్‌ హబ్‌లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.


కమిటీల్లో ఎవరెవరంటే...

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ తరహాలోనే అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్ల స్టీరింగ్‌ కమిటీలకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. వ్యవసాయం, రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, గృహనిర్మాణం, పర్యాటకం, పురపాలక, పట్టణాభివృద్ధి, అటవీ, ఐటీ శాఖ, పరిశ్రమలు, వాణిజ్యం, వైద్యఆరోగ్య శాఖ, ఆర్థిక, ప్రణాళిక, హోం శాఖ మంత్రులు సభ్యులుగా, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఈ రెండు రీజియన్ల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. వ్యవసాయం, రెవెన్యూ, రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, విద్యుత్‌, గృహనిర్మాణం, పర్యాటకం, పురపాలక, పట్టణాభివృద్ధి, అటవీ, ఐటీ శాఖ, పరిశ్రమలు, వాణిజ్యం, వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సెక్రటరీలు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధి, రైల్వే శాఖ ప్రతినిధి, పోర్టుల ప్రతినిధి, సెజ్‌ల ప్రతినిధి సభ్యులుగా, రెండు రీజియన్ల సీఈవోలు ఆయా కమిటీలకు మెంబర్‌ కన్వీనర్లుగా ఉంటారు. అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ అమలు కమిటీకి ఆ రీజియన్‌ సీఈవో చైర్మన్‌గా, అందులోని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, రీజనల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ కమిషన్లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులుగా, సీఆర్‌డీఏ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ అమలు కమిటీకి ఆ రీజియన్‌ సీఈవో చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఈ కమిటీలకు నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది.


అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ ఇదీ

అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌లో కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలు ఉన్నాయి. ఈ కారిడార్‌ విస్తీర్ణం 44,962 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర జీఎ్‌సడీపీలో ఈ జిల్లాల వాటా 35.15 శాతం.

తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ ఇదీ

తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌లో తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర జీఎస్‌డీపీలో ఈ జిల్లాల వాటా 34 శాతం.

Updated Date - Feb 26 , 2026 | 03:31 AM