Share News

ప్రారంభం.. ఇక లాంఛనమే!

ABN , Publish Date - May 08 , 2026 | 04:33 AM

రాజధాని అమరావతిలో ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారుల భవనాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక ప్రారంభం లాంఛనమే అన్నట్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రారంభం..  ఇక లాంఛనమే!

  • శరవేగంగా ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పనులు

  • స్విమింగ్‌పూల్‌ సహా సకల సదుపాయాలు

రాజధాని అమరావతిలో ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారుల భవనాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక ప్రారంభం లాంఛనమే అన్నట్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 నాటికే సివిల్‌ వర్కులు పూర్తి చేసుకుని రంగులు కూడా అద్దుకున్న ఈ భవన సముదాయంలోని ఆరు అపార్ట్‌మెంట్ల నిర్మాణ పనులు వైసీపీ ప్రభుత్వం రాకతో అటకెక్కా యి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం విద్యుదీకరణ సహా ఇంటీరియర్‌ పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. భవన సముదాయాల మధ్యలో రోడ్లు, చక్కని గార్డెనింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఎస్‌ ప్లస్‌ 12 అంతస్థులతో 144 ప్లాట్లు ఉంటాయి. ఒక్కో ప్లాటు 3,500 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 144 మంది అధికారులు ఒకేచోట ఉన్న నేపథ్యంలో వారి ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడేలా స్విమ్మింగ్‌పూల్‌, ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ జిమ్‌లతోపాటు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా కిడ్డీస్‌ పార్కులు, ఫంక్షన్‌ హాలు వంటి సకల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి అపార్ట్‌మెంటుపైనా భారీ స్థాయిలో సోలార్‌ ప్యానెల్స్‌, బాయిలర్లు ఏర్పాటు చేశారు. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌.. వరకూ మాత్రమే పిల్లర్లు ఉండగా, దీనిపైన 12 అంతస్థుల భవనం పిల్లర్లు లేకుండా షీర్‌ వాల్‌ టెక్నాలజీతో ఈ భవనాలు నిర్మించడం విశేషం. 2019కి ముందు భవనాల నిర్మాణ సమయంలో రికార్డులు కూడా సాధించారు. ఒక అపార్ట్‌మెంట్‌లో.. 7 రోజులకు ఒక అంతస్థు చొప్పున 84 రోజుల్లో నిర్మాణం పూర్తిచేసి రికార్డు సృష్టించారు.

-ఆంధ్రజ్యోతి, గుంటూరు (రాజధాని)

Updated Date - May 08 , 2026 | 04:34 AM