Share News

రాజధాని పాలనలో కీలక మార్పులు

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:02 AM

రాజధాని అమరావతి పరిపాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కమిషనర్‌గా విజయరామరాజు నవనగరాన్ని గ్రిడ్లుగా మార్చి, 9 జోన్లుగా ఏర్పాటు చేశారు.

రాజధాని పాలనలో కీలక మార్పులు

  • మూడు, నాలుగు గ్రామాలకు ఒక గ్రిడ్‌

  • మొత్తం 9 జోన్లుగా నవ నగరం విభజన

  • ఒక్కో జోన్‌కు ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్‌

  • గ్రామ స్థాయిలోనే రైతు సమస్యల పరిష్కారం

గుంటూరు(రాజధాని), జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పరిపాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కమిషనర్‌గా విజయరామరాజు నవనగరాన్ని గ్రిడ్లుగా మార్చి, 9 జోన్లుగా ఏర్పాటు చేశారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం అధికారులను, సీఆర్డీఏలో ల్యాండ్‌ పూలింగ్‌ యూనిట్లను విభజిస్తూ తొలుత సీసీఎల్‌ఏకు, గ్రామవార్డు సచివాలయ విభాగాలకు లేఖలు రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు కాగానే, ఇటీవల రాజధాని ప్రాంతం మొత్తాన్ని 9 జోన్లుగా మార్చారు.

జోన్ల వివరాలు ఇలా..

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న కొండమరాజుపాలెం రెవెన్యూను సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. కృష్ణాయపాలెం, పెనుమాక గ్రామాలను ఈస్ట్‌ జోన్‌లోకి, ఐనవోలు ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి, లింగాయపాలెం, ఉండవల్లి, వెంకటపాలెం నార్త్‌ ఈస్ట్‌ జోన్లోకి, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, మందడం 2 యూనిట్లు నార్త్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు నార్త్‌ వెస్ట్‌ జో న్‌ పరిధిలోకి, నవులూరు 1, 2 యూనిటు సౌత్‌ ఈస్ట్‌ జోన్‌లోకి, కురగల్లు 2యూనిట్లు, నిడమర్రు 2 యూనిట్లు సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుల్లూరు రెండు యూనిట్లు, అనంతవరం లను వెస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.


అధికారుల నియామకం ఇలా..

అమరావతి పరిధిలోని వ్యవహారాలన్నీ ఇప్పటి వరకూ గ్రామాల్లోని కాంపిటెంట్‌ అథారిటీలే చూసేవి. ఇక నుంచి వాటి కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. జోనల్‌ స్థాయిలో వచ్చే సమస్యలు సీఆర్డీఏ కార్యాలయం వరకు రాకుండా అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ఈ యంత్రాంగం ఉంటుంది. భూ యజమానులు నేరుగా సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లకుండా ఆయా జోన్ల పరిధిలోని సమస్యలు పరిష్కరించుకునేలా కొత్త ఏర్పాట్లు ఉన్నాయి. జోనల్‌ విధానంలో ప్రతి గ్రామాన్నీ ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్‌ఓ, లైసెన్స్డ్‌ సర్వేయర్‌, విలేజ్‌ సర్వేయర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డిజిటల్‌ అసిస్టెంటును నియమించారు. భూమి విస్తీర్ణం ఆధారంగా కొన్ని గ్రామాల్లో అదనపు సర్వేయర్లను నియమించారు. ఇవి కాకుం డా రాజధాని నగరంలో ల్యాండ్స్‌ విభాగానికి ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేశారు. అందులోనూ ఎస్‌డీసీ తోపాటు పది మంది సిబ్బందిని నియమించారు. ఏపీసీఆర్డీఏ క్యాపిటల్‌ రీజియన్‌ కోసం ప్రత్యేక ల్యాండ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఎల్పీఎస్‌ కో ఆర్డినేషన్‌ కోసం గుంటూరు కలెక్టరేట్లో ప్రత్యేక్‌ అడ్మిన్‌ కార్యాలయం, నెగోషియబుల్‌ సెటిల్మెంట్‌ పాలసీ(ఎన్‌ఎస్‌పీ), ఆర్‌ 1 పరిధిలో వ్యవహారాల కోసం రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇద్దరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారులతో మరొక విభాగాన్ని నియమించారు. తద్వారా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎదుర్కొనే సమస్యలు ఆయా గ్రామాల స్థాయిలోనే పరిష్కారమయ్యే మార్గం సుగమమైంది.

Updated Date - Jun 10 , 2026 | 05:03 AM