Share News

అమరావతి తల్లుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది రాళ్లు

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:06 AM

ప్రధాని మోదీ హామీ, సీఎం చంద్రబాబు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పోరాటం.. రాజధాని అమరావతి ఆశయానికి ఒక శక్తిగా, తెలుగు ప్రజల భవిష్యత్తుకు ఒక భరోసాగా నిలిచాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి....

అమరావతి తల్లుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది రాళ్లు

  • అమరావతి ఆశయానికి వారే ఒక శక్తి

  • రాజధానిని అణచివేయాలన్న జగన్‌ యత్నాలు సామాన్యమైనవి కావు

  • లోక్‌సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ హామీ, సీఎం చంద్రబాబు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పోరాటం.. రాజధాని అమరావతి ఆశయానికి ఒక శక్తిగా, తెలుగు ప్రజల భవిష్యత్తుకు ఒక భరోసాగా నిలిచాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. జగన్‌ పాలనలో వేధింపులకు గురైన అమరావతి ప్రాంత తల్లుల కన్నీళ్లు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలుగులో ఉద్వేగంగా మాట్లాడారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు ఆశయం, కల, ధ్యేయం, రాష్ట్రాభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా వదలని పట్టుదల చంద్రబాబుదని కొనియాడారు. పవన్‌ తన గళంతో, శక్తితో ప్రజల్లో ఉద్యమస్పూర్తి నింపారని తెలిపారు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని ప్రతిపాదిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా, రాజధానిని నిర్మించే ఈ చరిత్రాత్మక ఘట్టంలో అమరావతి బిడ్డగా ప్రసంగించడం తనకు దక్కిన అదృష్టమని, గౌరవమన్నారు.


జగన్‌ అణచివేత వల్లే...

అమరావతిని అణచివేయాలని, ఆపివేయాలని జగన్‌ చేసిన ప్రయత్నం సామాన్యమైనది కాదని, జైళ్లతో, జేసీబీలతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం నిజంగా ఒక చరిత్రేనని పెమ్మసాని అన్నారు. ‘‘జగన్‌ అణచివేత వల్లే రైతుల గుండెల్లో అమరావతి ఉద్యమ అగ్నిగా రగిలింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. మూడు రాజధానులని జగన్‌ ప్రజలను మభ్యపెట్టి ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారు. రైతులను ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అని పిలిచారు. సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురిచేశారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ 45 రోజుల మహా పాదయాత్రలో రైతులను అమానుష హింసకు గురిచేశారు. మేకులతో ఉన్న లాఠీలతో కొట్టారు. గర్భిణులపైనా దాడులు జరిగాయి. మహిళా దినోత్సవం రోజున, ఆలయానికి వెళ్లిన మహిళలపై దాడిచేశారు. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసుకుని, వీధుల్లోనే భోజనం చేశారు. ఇదే 1,631 రోజుల అమరావతి వ్యథ... కథ.. అయితే, ఆ తల్లుల కన్నీళ్లు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వైసీపీ వారు గ్రహించలేకపోయారు. నాటి ప్రభుత్వం చేసిన నేరాలను చరిత్ర ఎన్నటికీ మరచిపోదు’ అని చెప్పారు. రాష్ట్ర అభివృద్థిలో రాజధాని పాత్ర అత్యంత కీలకం అని చరిత్ర చెబుతోందని పెమ్మసాని అన్నారు. ‘‘కర్ణాటక ఆర్థిక వ్యవస్థలో బెంగళూరు 50శాతం వాటా, తమిళనాడులో చెన్నై 43శాతం, తెలంగాణలో హైదరాబాద్‌ 54శాతం వాటాతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, మీ రాజధాని ఏది అని అడిగితే, చెప్పుకోలేని అవమానాన్ని ఆంధ్రులు అనుభవించారు. ఇప్పుడు, నిర్మించబోయే అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుని, రాష్ట్ర అభివృద్థికి గ్రోత్‌ ఇంజన్‌గా నిలవబోతోంది. ఇప్పుడు క్వాంటమ్‌ వ్యాలీకి స్వాగతం పలుకుతున్నాం. ఈ చట్ట సవరణతో అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగవంతమవుతుంది.’ అని పెమ్మసాని ఆకాంక్షించారు.

Updated Date - Apr 02 , 2026 | 05:06 AM