విరూపాక్షిపై మరో కేసు నమోదు
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:55 AM
రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వాళ్లే దాడులు చేసి.. తిరిగి బాధితులపైనే నిందలు వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇందుకు తాజా నిదర్శనం. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి...
కర్నూలు (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వాళ్లే దాడులు చేసి.. తిరిగి బాధితులపైనే నిందలు వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇందుకు తాజా నిదర్శనం. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తన అనుచరులతో కలసి ఐదు వాహనాల్లో వెళ్లి దళితులు, మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ నాయకుల ఇళ్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో గాయపడ్డ తమ పార్టీ నేతలను పరామర్శించడానికి నేమకల్లు గ్రామానికి వస్తున్న చిప్పగిరి టీడీపీ మండల కన్వీనర్, వాల్మీకి/బోయ సామాజికవర్గానికి చెందిన కొండా పురుషోత్తంపై వైసీపీ శ్రేణులు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ సహా 12 మందిపై చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. కాగా, విరూపాక్షి, ఆయన అనుచరుల దాడుల్లో తలకు తీవ్ర గాయమైన యాదవ సామాజికర్గానికి చెందిన నక్కలదొడ్డి శేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన బళ్లారిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
దళిత మహిళపై దాడికి జగన్ సమాధానం చెప్పాలి: టీడీపీ నేతలు
టీడీపీకి చెందిన దళిత నాయకుల ఇళ్లపై విరూపాక్షి, తన అనుచరులతో దాడులకు పాల్పడమే కాకుండా దళిత మహిళ అని కూడా చూడకుండా సుచిత్రపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ నేత గుడిసె కృష్ణమ్మ, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆరోపించారు. బాధితులను పరామర్శించారు. దళిత మహిళపై దాడికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అరెస్టుపై అసెంబ్లీ బులెటిన్ విడుదల
ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి అరెస్టుపై ఏపీ శాసనసభ బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు 2 తెల్లవారుజామున 3గంటలకు చిప్పగిరిలోని నివాసంలో ఎమ్మెల్యేను కర్నూలు జిల్లా ఆలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేసినట్లు వెల్లడించింది. చిప్పగిరి పోలీ్‌సస్టేషన్‌లో బీఎన్‌ఎ్‌సలోని పలు సెక్షన్ల కింద నమోదైన(క్రైమ్ నంబర్ 37/2026) కే సులో అరెస్టయినట్లు శాసనసభకు సమాచారం ఇచ్చారు. మరో క్రైమ్‌నంబర్ 38/2026 కేసులోనూ ఏ1గా ఉన్నట్లు వెల్లడించారు. రెండు కేసుల్లో బీఎన్‌ఎస్‌తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర బులెటిన్ జారీ చేశారు.