ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు స్వాగతం
ABN , Publish Date - May 25 , 2026 | 04:54 AM
దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చి తీరుతుందనే విశ్వాసం తమకు ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు.
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 24(ఆంధ్రజ్యోతి): దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చి తీరుతుందనే విశ్వాసం తమకు ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు. అది కాక్రోచ్ రూపంలో లేదా మరో రూపంలో వచ్చినా స్వాగతం పలుకుతామన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పెట్టుబడిదారులు రెండు వర్గాలుగా విడిపోయి, వారికి వారే పోటీగా మారారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు నిరూపించాయి. తాజాగా తమిళనాడులో సైతం వ్యవస్థీకృత పార్టీలను కాదని, కొత్తవారిని ఎన్నుకున్నారు. యువత ఆవేశపూరిత రాజకీయ, సాంఘిక, ప్రత్యామ్నాయ ఆలోచనలు రాజకీయ స్వరూపం తీసుకుంటోంది. అలాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వామపక్ష వాదులు ముఖ్యంగా సీపీఐ సిద్ధంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా అవినీతికి, అవినీతికి మధ్యే పోటీ ఉంది.. నీతికి, అవినీతికి మధ్య కాదు. ఉద్యమించే వారిని తుదముట్టిస్తే ఉద్యమాలు ఆగవు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకోవాలి’ అని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్.. జనసేన నేతలపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక రాజకీయ అంశాలపై మాట్లాడినప్పుడు ఆధారం ఏమిటో నిర్దిష్టంగా చెప్పి ఉండాల్సిందన్నారు. తర్వాత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.