Share News

ఆలమట్టికి వరద

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:00 AM

మహారాష్ట్రలో, కర్ణాటకలోని 3 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదిపై నిర్మించిన ఆలమట్టి డ్యాంకు బుధవారం ఒకే రోజు 11 టీఎంసీల వరద నీరు చేరింది.

ఆలమట్టికి వరద

  • ఒకే రోజు 11 టీఎంసీల ప్రవాహం

  • కన్నడ నాట అన్ని జలాశయాలకూ నీరు

  • తుంగభద్రకు 45 వేల కూసెక్కుల వరద

  • 4 రోజుల్లో 6 టీఎంసీలు చేరిక

  • శ్రీశైలం, జూరాలకు జాడ లేని కృష్ణమ్మ!

బెంగళూరు/బళ్లారి/కర్నూలు/అచ్చంపేట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో, కర్ణాటకలోని 3 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదిపై నిర్మించిన ఆలమట్టి డ్యాంకు బుధవారం ఒకే రోజు 11 టీఎంసీల వరద నీరు చేరింది. లింగనమక్కి జలాశయానికి 3 టీఎంసీలు, భద్ర, హేమావతి, కబిని జలాశయాలకు రెండు టీఎంసీల చొప్పున వచ్చింది. దీంతో కర్ణాటకలోని 14 జలాశయాల్లో నీటి నిల్వలు 277 టీఎంసీలకు చేరాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం డ్యాంలకు చుక్క నీరు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఆలమట్టి జలాశయానికి 1.31 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శివమొగ్గలోని లింగనమక్కి జలాశయానికి 36,867 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యాంకు 45 వేల కూసెక్కులు, భద్ర-16,304 క్యూసెక్కులు, హేమావతి-15,647 క్యూసెక్కులు, కబిని-14,574 క్యూసెక్కులు, కృష్ణరాయసాగర్‌ జలాశయానికి 12,694 క్యూసెక్కుల వరద వస్తోంది. కర్ణాటకలో మలెనాడు ప్రాంతంగా పిలిచే హాసన్‌, కొడుగు జిల్లాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. తీరప్రాంతం, పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే బెంగళూరు, మైసూరు అనుబంధ జిల్లాల్లో చినుకు రాలడం లేదు.

శ్రీశైలం ఎదురుతెన్నులు..

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన శ్రీశైలం, జూరాల డ్యాంలకు కృష్ణమ్మ జాడే లేదు. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. 821.60 అడుగుల్లో 42.019 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రోజు రోజుకూ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల పూర్తిస్థాయిలో నిండి.. ఆపై వరద కొనసాగితే తప్ప శ్రీశైలానికి ప్రవాహం చేరే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పైన తెలంగాణలోని జూరాల పరిస్థితీ ఇంతే. డ్యాం గరిష్ఠ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.684 టీఎంసీల నీరుంది.


సాగర్‌, పులిచింతల పరిస్థితి..

నాగార్జున సాగర్‌ జలాశయం నీటిమట్టం గురువారం నాటికి 513.80 అడుగులు ఉంది. ఇది 138.21 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో గురువారం 31.41 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు.

తుంగభద్రకు పెరుగుతున్న వరద..

తుంగభద్ర జలాశయానికి క్రమంగా వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 45,578 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. గత నాలుగు రోజుల వ్యవధిలో డ్యాంలోకి సుమారు ఆరు టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 1594 అడుగుల వద్ద 15.049 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. 22 క్రస్ట్‌ గేట్ల నుంచి 45,578 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరు తుంగభద్ర డ్యాంవైపు పరుగులు తీస్తోంది.

Updated Date - Jul 10 , 2026 | 04:01 AM