Share News

ఆలమట్టిలోకి 1904 క్యూసెక్కులే

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:03 AM

ఎగువన మహారాష్ట్ర నుంచి కృష్ణా నదిలోకి వరద పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి నామమాత్రపు ప్రవాహం వస్తోంది.

ఆలమట్టిలోకి 1904 క్యూసెక్కులే

  • ఎగువ నుంచి పూర్తిగా తగ్గిన వరద

  • గోదావరిలోనూ తగ్గుతున్న నీటిమట్టం

కర్నూలు/పోలవరం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎగువన మహారాష్ట్ర నుంచి కృష్ణా నదిలోకి వరద పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి నామమాత్రపు ప్రవాహం వస్తోంది. రాయలసీమ జీవనాడి అయిన తుంగభద్ర డ్యాం పరిస్థితి కూడా ఇంతే. ఆలమట్టి గరిష్ఠ నిల్వ సామర్థ్యం 129.720 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.268 టీఎంసీలుగా నమోదైంది. ఆనకట్టలోకి 1904 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. వాస్తవానికి తుంగభద్రకు ఆశాజనంగా వరద ప్రారంభం కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఎగువన వర్షాలు ఆగిపోవడంతో ఐదారు రోజులకే వరద తగ్గిపోయింది. గురువారం ఉదయం 8 గంటలకు 4,620 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. 25.20 టీఎంసీలు మాత్రమే చేరాయి. ఇక జూరాల, శ్రీశైలం డ్యాంలలోకి ఇప్పటి వరకు చుక్క నీరైనా రాలేదు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. గురువారం 821.20 అడుగుల వద్ద 41.69 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది. నాగార్జున సాగర్‌ జలాశయం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 137.864 టీఎంసీలుగా నమోదైంది.

స్పిల్‌వే ఎగువన 26.360 మీటర్ల నీటిమట్టం

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు లేకపోవడంతో గురువారం నీటిమట్టం బాగా తగ్గింది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 33,646 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు. స్పిల్‌వే ఎగువన 26.360 మీటర్లు, కాఫర్‌ డ్యాం ఎగువన 26.400 మీటర్ల నీటిమట్టం నమోదైంది. కాగా.. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పోలవరం కుడి కాలువకు 7,434 క్యూసెక్కులు విడుదల చేసినట్టు పథకం ఈఈ ఏసుబాబు తెలిపారు. 21 మోటార్లతో నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 05:04 AM