ఆలమట్టిలోకి నిలకడగా వరద
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:30 AM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.
ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలపైనే
79 శాతం నిండిన జలాశయం
దిగువకు 12,500 క్యూసెక్కుల విడుదల
నారాయణపూర్ డ్యాంకు14,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం పరిస్థితిలో మార్పు లేదు
అమరావతి/అచ్చంపేట/విజయపురి సౌత్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 123.081 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను డ్యాంలో ప్రస్తుతం 97.277 టీఎంసీల నీరుంది. దాదాపు 79.035 శాతం నిండింది. మంగళవారం డ్యాంలోకి 46,848 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 12,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలోకి 14,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 8,209 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 3667 క్యూసెక్కులు వస్తుండగా.. 3254 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అటు జూరాలకు 32 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. అంతే మొత్తాన్ని కాలువలకు వదులుతున్నారు. శ్రీశైలంలోకి చుక్కనీరైనా రావడం లేదు. ఎగువ నుంచి నాగార్జునసాగర్ డ్యాంలోకి 900 క్యూసెక్కులు వస్తుండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అంతేమొత్తాన్ని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో సోమవారం 29.36 టీఎంసీల నీరుంది. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది.