నిండుతున్న ఆలమట్టి!
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:49 AM
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం 87.77 శాతం నిండింది. 123.081 టీఎంసీల గరిష్ఠ నిల్వ సామర్థ్యానికి గాను 108.030 టీఎంసీలు ఉన్నాయి.
గరిష్ఠ సామర్థ్యానికి 15 టీఎంసీల దూరం
డ్యాంలోకి 88,228 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
దిగువకు 67,500 క్యూసెక్కులు విడుదల
నారాయణపూర్ డ్యాం కళకళ.. 93 శాతం నిండిన ప్రాజెక్టు
జూరాలకు ఇంకా చేరని నీరు, శ్రీశైలం జలాశయం వెలవెల
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం 87.77 శాతం నిండింది. 123.081 టీఎంసీల గరిష్ఠ నిల్వ సామర్థ్యానికి గాను 108.030 టీఎంసీలు ఉన్నాయి. మరో 15 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతుంది. శనివారం జలాశయంలోకి 88,228 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 67,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ డ్యాం దాదాపు నిండుతోంది. జలాశయం గరిష్ఠ సామర్థ్యం 33.313 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 31.230 టీఎంసీలు ఉన్నాయి. శనివారం 66,692 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 39,604 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కానీ ఇంకా ఈ నీరు తెలంగాణలోని జూరాలకు చేరలేదు. జూరాల డ్యాంలో 9.650 టీఎంసీలకు 5.042 టీఎంసీల నిల్వలున్నాయి. 544 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. తుంగభద్ర డ్యాంకు 14,281 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దిగువకు 3,574 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ డ్యాం గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 30.385 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. మరోవైపు.. శ్రీశైలం డ్యాం వెలవెలబోతోంది. ఏ వైపు నుంచీ ప్రవాహం లేదు. పరివాహక ప్రాంతంలో వర్షాలు కూడా లేవు. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల నిండితే తప్ప దిగువకు శ్రీశైలంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. జలాశయంలో 215.810 టీఎంసీలకు గాను 41.569 టీఎంసీలే నిల్వ ఉంది. 800 క్యూసెక్కులను కల్వకుర్తి ఎత్తిపోతలకు తరలిస్తున్నారు. నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీలకుగాను 137.167 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45.770 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను ప్రస్తుతం 29.160 టీఎంసీలు ఉన్నాయి.