Share News

ఆల్మట్టిపై ఇన్ని అబద్ధాలా?

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:53 AM

కర్ణాటక తలపెట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రభుత్వాలు చేసిన పోరాటాలకు చారిత్రక ఆధారాలున్నాయని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఆల్మట్టిపై ఇన్ని అబద్ధాలా?

  • ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రభుత్వాల పోరు

  • కేంద్రానికి ఎన్టీఆర్‌,బాబు లేఖాస్త్రాలు

  • ‘సాక్షి’పై మంత్రి నిమ్మల ఆగ్రహం

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కర్ణాటక తలపెట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రభుత్వాలు చేసిన పోరాటాలకు చారిత్రక ఆధారాలున్నాయని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం జగన్‌ రోతపత్రిక ఆల్మట్టి డ్యాంపై పూర్తి అసత్యాలను ప్రచురించిందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘1963 నవంబరు 28వ తేదీన ప్రణాళికా సంఘం కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రధాన డ్యాములు. వీటిని మూడు దశల్లో నిర్మించేందుకు కర్ణాటక ప్రతిపాదించింది. 1976లో కృష్ణా ట్రైబ్యునల్‌-1 ఎగువ కృష్ణా ప్రాజెక్టుల తొలిదశ కింద 155 టీఎంసీల వినియోగానికి అనుమతించింది. ఆ రాష్ట్రం తన మాస్టర్‌ ప్లాన్‌-2002 ప్రకారం అప్పర్‌ కృష్ణా రెండో దశలో 173 టీఎంసీలను కేటాయిస్తూ ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్లుగా నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ నాటి సీఎం ఎన్టీఆర్‌ 1987 జనవరి 29 నుంచి 1989 డిసెంబరు రెండో తేదీ మధ్య కేంద్రానికి ఐదు లేఖలు రాశారు. 1996 మార్చి 17 నుంచి 1997 మార్చి 21 మధ్య కాలంలో అప్పటి సీఎం చంద్రబాబు ఏకంగా 18 లేఖలు రాశారు. ఆల్మట్టి నిర్మాణంతో ఏపీకి జరిగే నష్టాన్ని వివరించారు. 1998 జూలై 21న టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు.. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుతో ఆంధ్రప్రదేశ్‌పై పడే ప్రతికూలతలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఆల్మట్టి ఎత్తు 519.60 మీటర్లకు పెంచేందుకు ఏపీ అంగీకరించడం లేదని 1998 అక్టోబరు పదో తేదీన నాటి కేంద్ర విద్యుత్‌ మంత్రికి చంద్రబాబు లేఖ రాశారు. 1999 డిసెంబరు 3వ తేదీన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి.. ఆల్మట్టి ఎత్తుకు అంగీకరించేది లేదని అదే రోజున ప్రధాని వాజపేయికి చంద్రబాబు లేఖ అందించారు. 2000 ఏప్రిల్‌ 25న ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్లకు ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 524 మీటర్ల ఎత్తులో నిర్మించడంపై అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. 2004ఏప్రిల్‌ 2న కృష్ణానదీ జలవివాద ట్రైబ్యునల్‌-2 ఏర్పాటైంది. 2010 డిసెంబరు 30న 524 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ 2011 మార్చి 28న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. దీంతో గెజిట్‌ను ప్రచురించవద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013 నవంబరు 29న ట్రైబ్యునల్‌-2 డ్యాం ఎత్తు పెంచుకోవచ్చంటూ మరో తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ 2014 జనవరి 16న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. చంద్రబాబు 2024 నవంబరు 3న, 2025 నవంబరు 22న లేఖలు రాశారు. డిసెంబరు 18న మరో లేఖను రాశారు. అయినా జగన్‌ రోతపత్రిక అబద్ధాలతో బొంకుల కథనం అల్లింది’అని నిమ్మల ఆగ్ర హం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 11 , 2026 | 03:53 AM