Share News

తండ్రి ద్రోహాన్ని కప్పేసి.. తన నిర్లక్ష్యానికి ముసుగేసి..!

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:55 AM

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని.. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందంటూ జగన్‌ రోత పత్రిక రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తండ్రి ద్రోహాన్ని కప్పేసి.. తన నిర్లక్ష్యానికి ముసుగేసి..!

  • ఆల్మట్టి డ్యాం ఎత్తుపై జగన్‌ పత్రిక బురద

  • బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏనాడూ సమర్థ వాదనలు వినిపించని వైఎస్‌

  • సుప్రీంలోనూ న్యాయపోరాటం చేయని వైనం

  • 2019లో జగన్‌ వచ్చాక అంతులేని అలక్ష్యం

  • తన పాపాన్ని చంద్రబాబుకు చుట్టే కుయుక్తులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని.. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందంటూ జగన్‌ రోత పత్రిక రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉండగా ఈ డ్యాం ఎత్తు పెంపును అడ్డుకోవడానికి ఒక్క ప్రయత్నమూ చేయలేదన్న వాస్తవాన్ని, ఆయన సీఎంగా ఉండగా తీవ్ర నిర్లక్ష్యం వహించిన నిజాన్ని కప్పిపుచ్చి.. ఆ పాపాన్ని సీఎం చంద్రబాబుకు చుట్టేందుకు విషపూరిత కథనం ప్రచురించిందని ధ్వజమెత్తాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 525.256 మీటర్లకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. 2004 ఏప్రిల్‌ 2వ తేదీన జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ సారథ్యంలో కృష్ణా జల వివాదాలట్రైబ్యునల్‌-2 ఏర్పడింది. అప్పట్లోనే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును ప్రతిపాదిస్తే.. నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఽఖర్‌రెడ్డి ట్రైబ్యునల్‌ ముందు సమర్థ వాదనలు వినిపించలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపును నిరసిస్తూ సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయలేదు. తద్వారా రాష్ట్రాన్ని ముంచేశారంటూ అప్పట్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. 2004 నుంచి 2009 సెప్టెంబరు దాకా అధికారంలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును నిలువరించేందుకు ఒక్క ప్రయత్నమూ చేయలేదు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర రైతాంగం మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది.


నిద్రాణంగా ఉండిపోయి..: 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆల్మట్టి ఎత్తు పెంపును పట్టించుకోనేలేదని.. పైగా తెలంగాణ తలపెట్టిన జల దోపిడీని కూడా ఏనాడూ ప్రశ్నించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలని.. నదీ జలాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మెలగాలంటూ నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి కలిసి మీడియా ఎదుట సుద్దులు చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దంటూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖలు రాయలేదు. ఆ రాష్ట్ర సీఎంలతో సంప్రదింపులు కూడా జరుపకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఏపీ పిటిషన్‌ సివిల్‌ దావాగా మారిన సందర్భంలోనూ న్యాయపోరాటం చేయకుండా నిద్రాణంగా ఉండిపోయారు. చంద్రబాబు మాత్రం అప్పుడు, ఇప్పుడూ దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గట్టిగా పోరాడుతుంటే.. ప్రతిపక్ష నేతగానూ, ముఖ్యమంత్రిగానూ పదేళ్ల పాటు వీటిపై దృష్టి పెట్టని జగన్‌ తన విషపత్రికలో మాత్రం కర్ణాటక ఇప్పుడే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్నట్లుగా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నట్లుగా విషం చిమ్ముతున్నారని టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఏమాత్రం వాస్తవం లేని తప్పుడు కథనాలతో రాష్ట్ర రైతాంగాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. కానీ అన్నదాతలు ఆయన మోసాన్ని ఇదివరకే గ్రహించారని అంటున్నారు. ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమంటూ వైసీపీ నేతలతో పోతిరెడ్డిపాడు వద్ద జగన్‌ జరిపించిన బహిరంగ సభ తుస్సుమందని.. దీనికి రైతులెవరూ రాకపోగా.. హాజరైన రైతు సంఘాల నేతలు రాయలసీమ ప్రాజెక్టులను జగన్‌ నిర్లక్ష్యం చేశారని విమర్శించారని చెబుతున్నారు. రైతులను నేరుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఇప్పుడు తన రోతపత్రికలో తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారని మండిపడుతున్నారు. సీమ ప్రాజెక్టులపై జగన్‌ తీవ్ర నిర్లక్ష్యం.. ఇసుక దోపిడీకి అన్నమయ్య డ్యాంనే బలిగొన్న వైనాన్ని ప్రత్యక్షంగా చూసిన రైతాంగం 2024 ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టిందని గుర్తుచేస్తున్నారు. చేయని పనులు కూడా గొప్పగా చేసినట్లు భ్రమింపజేయడానికి ఇలాంటి విషపు కథనాలతో చేసే ప్రచారానికి ప్రజల మద్దతు దక్కదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 03:55 AM