Share News

ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:03 AM

కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 12 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం1,31,940 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..

ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు

  • ఒక్కరోజే 12 టీఎంసీలు చేరిక.. నేటి నుంచి తగ్గనున్న ఇన్‌ఫ్లో

బళ్లారి/అచ్చంపేట/విజయపురి సౌత్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 12 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం1,31,940 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 483 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయం నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 86.061 టీఎంసీలు ఉంది. మహారాష్ట్రలో వరా ్షలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో వరద తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆలమట్టికి వచ్చే ప్రవాహం కూడా వచ్చే నాలుగు రోజుల్లో బాగా తగ్గుతుందని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నాటికి 64,700 క్యూసెక్కులకు తగ్గుతుందని.. క్రమంగా 17వ తేదీకి 8,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంటుందని అంటున్నాయి. కాగా, తుంగభద్ర జలాశయానికి కూడా వరద తగ్గుతోంది. శనివారం 38,9 77 క్యూసెక్కులుగా నమోదైన ఇన్‌ఫ్లో.. ఆదివారానికి 25,120 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 22.948 టీఎంసీల నిల్వ ఉంది. ఆలమట్టి దిగువన నారాయణపూర్‌, జూరాలకు ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం డ్యాంలోకి చుక్క నీరైనా రావడం లేదు. నాగార్జునసాగర్‌ పరిస్థితి కూడా ఇంతే. ప్రస్తుతం సాగర్‌లో 138.03 టీఎంసీల నీరుంది. పులిచింతలలో ఆదివారం 30.99 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగు వ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయింది.


గోదావరికి వరద తగ్గుముఖం

రాజమహేంద్రవరం/ధవళేశ్వరం: గోదావరికి వరద తగ్గింది. ఆదివారం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి 47,842 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈనెల 8 నుంచి ప్రవా హం మొదలు కాగా.. మర్నాడు దిగువకు 1,15,480 క్యూసెక్కులను వదిలారు.

ఎర్రబారిన కృష్ణమ్మ

ఇబ్రహీంపట్నం: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పరుగు పరుగున వచ్చిన గోదావరి వరద జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శనివారం రాత్రి కృష్ణానదిలో కలిశాయి. ఆదివారం ఉదయానికి అప్పటి వరకు నీలం రంగులో ఉన్న నది నీరు ఎర్రబారింది. ఓపక్క నీలం రంగు నీరు, మరోపక్క ఎర్రటి నీరు కలిసిన ప్రదేశమైన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమానికి పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ దృశ్యా న్ని ఆసక్తిగా తిలకించారు. పట్టిసీమ ద్వారా 20 పంపుల నుంచి 7,080 క్యూసెక్కుల గోదావరి జలాలు కృష్ణమ్మలో కలుస్తున్నాయి. ఇలా వచ్చిన నీటిని కృష్ణా డెల్టాకు సాగునీరుగా విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 04:04 AM