దర్జాగా కాటసాని కబ్జా!
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:43 AM
వైసీపీ ప్రభుత్వ హయాం అంటేనే అవినీతి, భూకబ్జాలు, అక్రమాలు, దాడులు! ఆ పార్టీ ప్రభుత్వంలో వీటికి హద్దే లేకుండా పోయింది!! చేతిలో అధికారం ఉందని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు.
వైసీపీ హయాంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా
ఎస్సార్బీసీ బఫర్ జోన్‌లో స్మృతివనం ఏర్పాటు
బనగానపల్లెలోని ఆ భూమి విలువ 15 కోట్లు!
అప్పట్లో సహకరించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
ఆక్రమణ నిజమేనని నిగ్గుతేల్చిన అధికారులు
కబ్జా వ్యవహారంపై కఠిన చర్యలకు సర్కార్ ఆదేశం
(నంద్యాల-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వ హయాం అంటేనే అవినీతి, భూకబ్జాలు, అక్రమాలు, దాడులు! ఆ పార్టీ ప్రభుత్వంలో వీటికి హద్దే లేకుండా పోయింది!! చేతిలో అధికారం ఉందని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. యథేచ్ఛగా భూఆక్రమణలకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రామిరెడ్డి సర్కారు భూములను ఆక్రమించేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్లకు పైగా విలువుండే సుమారు 3 ఎకరాల ప్రభుత్వ (ఎస్సార్బీసీ బఫర్ జోన్) స్థలాన్ని కబ్జా చేసి.. అందులో తన కుమారుడి సమాధి చుట్టూ ఘాట్‌ను, పార్కు, ప్రహరీ గోడను నిర్మించారు. దీనికి అప్పట్లో జిల్లాకు చెందిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కబ్జా వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల చేపట్టిన విజిలెన్స్ అధికారుల తనిఖీల్లోనూ బట్టబయలైంది. ప్రభుత్వ భూమిలో స్మృతివనం నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టారని నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్, రెవెన్యూ తదితర ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పాటు పలు లోపాలున్నట్లు గుర్తించి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కబ్జా వ్యవహారంపై చర్యలకు అదేశిస్తూ గత నెలలో ప్రభుత్వం పరంగా సీసీఎల్‌ఏ నుంచి నంద్యాల కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో సహకరించిన అధికారులతో పాటు ఆక్రమణదారులపైనా కఠినమైన చర్యలకు అదేశించినట్లు తెలిసింది.
వైసీపీ అధికారంలోకి రావడంతో..
కాటసాని రామిరెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి 2018 జూన్ 15న మరణించారు. నాడు టీడీపీ అధికారంలో ఉండటంతో బనగానపల్లె మండలం భానుముక్కల గ్రామంలోని ఎస్సార్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) కాలువకు పక్కన ఉండే తమ స్థలంలో సమాధి నిర్మించి వదిలేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలో రావడం.. పైగా ఎమ్మెల్యేగా కాటసాని గెలుపొందడంతో ఆయన అక్రమాలకు తెరలేపారు. ఎస్సార్బీసీ కాలువకు అనుకుని ఉన్న సర్వే నెంబర్ 369లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో(ఎస్సార్బీసీ బఫర్ జోన్) ఎలాంటి అనుమతులు లేకుండా ఘాట్ నిర్మించేశారు. ఆ భూమి ఎస్సార్బీసీ బఫర్‌కు చెందిన భూమి కాగా.. దీనికి అనుమతులు వచ్చే అవకాశం లేదని గ్రహించిన కాటసాని.. ఒక ప్లాన్ ప్రకారం సదరు భూమిలో ఘాట్ ఏర్పాటు చేయడానికి స్థానిక జలవనరులశాఖ అధికారులకు ఒక దరఖాస్తు చేశారు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ శాఖ అధికారి ఎన్‌ఓసీని జారీ చేసేశారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.
ఆ భూమి విలువ చెల్లిస్తా: కాటసాని
ఈ వ్యవహారంపై కాటసాని రామిరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఆయన మాట్లాడుతూ ‘‘నా కుమారుడి స్మారక ఘాట్ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. అయితే ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. ప్రభుత్వం అనుమతిస్తే ఆ భూమి విలువ చెల్లిస్తాను. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు.
రెండు ప్రభుత్వాల్లోనూ ప్రయత్నాలు
ఎవరైనా ప్రభుత్వ భూమి తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. అయితే ఆక్రమిత భూమి ఎస్సార్బీసీ బఫర్ జోన్ పరిధిలో ఉండటంతో క్యాబినెట్ ఆమోదించే అవకాశమే లేదు. సదరు భూమిని తమకు కేటాయించాలని వైసీపీ హయాంలో కాటసాని పదేపదే దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ అధికారికంగా అనుమతులు లభించలేదు. అయినా తగ్గని కాటసాని.. బఫర్ జోన్‌లో ఘాట్‌ను విస్తరింపజేశారు. ఇదిలా ఉండగా 2024లో కూడా కూటమి ప్రభుత్వంలోనూ క్యాబినెట్ ఆమోదం కోసం దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ ప్రభుత్వం కూడా ఫైల్‌ను తిరస్కరించింది. ఇప్పటికీ వైసీపీకి టచ్‌లో ఉన్న కీలకఅధికారులతో దీనిపై రాయబేరాలు సాగిస్తున్నట్లు తెలిసింది.