పవన్‌ను ఇరికించాలి!
ABN , Publish Date - Jun 18 , 2026 | 02:51 AM
‘విషయం ఏదైనా వివాదాస్పదం చేయాలి. చావునూ రాజకీయాలకు వాడుకోవాలి’... ఇదే వైసీపీ పాలసీ. దీనికి అనుగుణంగా కొత్తగా కుల కుతంత్రాలకు తెరలేపుతోంది.
ఆయనపై కాపులను రెచ్చగొట్టండి
సాయికృష్ణ అదృశ్యం..
మనకు అడ్వాంటేజ్ కావాలి
ధర్నాలతో హడావుడి చేయాలి
వైసీపీ కాపు నేతలకు జగన్ ఆదేశం!
కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యతలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘విషయం ఏదైనా వివాదాస్పదం చేయాలి. చావునూ రాజకీయాలకు వాడుకోవాలి’... ఇదే వైసీపీ పాలసీ. దీనికి అనుగుణంగా కొత్తగా కుల కుతంత్రాలకు తెరలేపుతోంది. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ సాయికృష్ణ ‘అదృశ్యం’ కేసును తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. సాయికృష్ణ నేర నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ... ఆయన కాపు కులానికి చెందినందున ఈ విషయాన్ని తమకు ‘అడ్వాంటేజ్’గా మార్చుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ మాజీ మంత్రి కన్నబాబుతోపాటు వైసీపీకి చెందిన పలువురు కాపు నేతలతో జగన్ సమావేశమయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు సాయికృష్ణ అదృశ్యం కేసును వాడుకోవాలని జగన్ ఆదేశించారు. ‘‘సాయికృష్ణ వివాదంలో నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఇరికించాలి’ అని సూటిగా చెప్పారు. ‘‘నగరానికి చెందిన కాపు నాయకులను పిలిపించి హడావుడి చేయండి. సాయికృష్ణ కుటుంబ సభ్యులనూ వదలొద్దు, కాపుల్లో భావోద్వేగాలు పెంచేలా ప్రెస్‌మీట్లు పెట్టించండి. సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదు... కమిషనర్ రాజశేఖర బాబును సస్పెండ్ చేయాలి. ఈ వివాదాన్ని అస్సలు వదలొద్దు. ఎక్కడికక్కడ ధర్నాలు చేయించండి. మొత్తం విషయాన్ని మనకు అనుకూలంగా మార్చండి’’ అని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను కన్నబాబుకు అప్పగించినట్లు తెలిసింది.
జగన్ మీడియాలోనూ...
ఏ సంఘటన జరిగినా దానికి కులం రంగు పులమాలని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోవాలని వైసీపీ స్పష్టంగా నిర్ణయించుకుంది. ఈ అగ్నికి జగన్ మీడియా అక్షరాలా ఆజ్యం పోస్తోంది. విషయాన్ని నేరుగా చెప్పకుండా... బాధితుల కులాన్ని బయటికి తీస్తోంది. కాపు యువకుడు, యాదవ బాధితుడు... ఇలా అదే పనిగా కులం పేరు ప్రస్తావిస్తోంది. నిజానికి... విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఒక రౌడీ షీటర్. ఆయనపై అత్యాచారం సహా సుమారు 20 కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టు అయ్యాడు. ఈ విషయాలు స్థానికంగా అందరికీ తెలుసు. అయినా సరే... సాయికృష్ణ నేర చరిత్రను కాకుండా, కులాన్ని మాత్రమే ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. ఇదంతా ప్రజలను కులాలవారీగా చీల్చడం, మరీ ముఖ్యంగా పవన్‌కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టడమనే వ్యూహంలో భాగమే!