‘ఆళ్ల’ వ్యాజ్యాలకు విచారణార్హత లేదు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:54 AM
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్‌ఆర్) కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, అలాగే ఈ కేసును విజయవాడలోని ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు...
హైకోర్టుకు నివేదించిన ముకుల్ రోహత్గీ
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్‌ఆర్) కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, అలాగే ఈ కేసును విజయవాడలోని ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆళ్ల దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ముందుగా ఈ పిటిషన్ల విచారణార్హతపై వాదనలు వినాలని కోరారు. ఈ అభ్యర్థనకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను మార్చి 16కి వాయిదా వేశారు. ఆ రోజు పిటిషన్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలని ఇరుపక్షాలను న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ ఆళ్ల తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఐఆర్‌ఆర్ కేసులో సీఐడీ ఇప్పటికే తుది నివేదికను దాఖలు చేసిందన్నారు. కేసు లో ప్రస్తుత సీఎం, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మాత్రమే విచారణ జరపాలని పేర్కొన్నారు. ఈ కేసును ఏసీబీ కోర్టు విచారించడం చట్టవిరుద్ధమన్నారు. ఇదిలావుంటే, ఐఆర్‌ఆర్ కేసులో 2024లో దాఖలుచేసిన ప్రాథమిక చార్జిషీటుతో పాటు ఇటీవల వేసిన తుది నివేదిక కాపీలను తనకు అందజేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ ఆళ్ల మరో పిటిషన్ వేశారు. ఇది జస్టిస్ వై. లక్ష్మణరావు ముందు విచారణకు రాగా, రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.