Share News

ఆవేదనే మిగిలింది!

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:15 AM

‘సీబీఐ మాకు న్యాయం చేయలేదు. పోలీసులు ఏం చేశారో సీబీఐ అదే చేసింది. మా కుమార్తె హత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఇక న్యాయపోరాటం చేసే ఓపిక, శక్తి మా దగ్గర లేవు. బీఫార్మసీ విద్యార్థిని అయేషామీరా కేసు విచారణ సందర్భంలో ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. దర్యాప్తు సంస్థలు తమకు న్యాయం చేయలేవు అని వారు కోర్టుకు స్పష్టం చేశారు. అయేషా మీరాపై లైంగిక దాడి, హత్య కేసులో చివరకు ఆమె తల్లిదండ్రులకు ఆవేదన మాత్రమే మిగిలింది.

ఆవేదనే మిగిలింది!

- 19 ఏళ్ల తర్వాత వెలువడిన అయేషా మీరా కేసు తీర్పు

- దోషులను తేల్చని సీబీఐ

- కేసు విచారణను ముంగిచేసిన సీబీఐ కోర్టు

- ఇక పోరాడే ఓపిక లేదు : అయేషా తల్లిదండ్రులు

‘సీబీఐ మాకు న్యాయం చేయలేదు. పోలీసులు ఏం చేశారో సీబీఐ అదే చేసింది. మా కుమార్తె హత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఇక న్యాయపోరాటం చేసే ఓపిక, శక్తి మా దగ్గర లేవు. బీఫార్మసీ విద్యార్థిని అయేషామీరా కేసు విచారణ సందర్భంలో ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. దర్యాప్తు సంస్థలు తమకు న్యాయం చేయలేవు అని వారు కోర్టుకు స్పష్టం చేశారు. అయేషా మీరాపై లైంగిక దాడి, హత్య కేసులో చివరకు ఆమె తల్లిదండ్రులకు ఆవేదన మాత్రమే మిగిలింది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో 2007 డిసెంబరు 27న జరిగిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరాపై లైంగిక దాడి, హత్య రాష్ట్రంలో పెనుసంచలనం కలిగించింది. ఈ ఘటన జరిగి 2025 డిసెంబరు 27 నాటికి 19 ఏళ్లు పూర్తయింది. ఒక్కగాని ఒక్క కుమార్తెను కోల్పోయిన నాటి నుంచి అయేషా తల్లిదండ్రులు ఇక్బాల్‌బాషా, శంషాద్‌ బేగం న్యాయస్థానాలు మెట్లు ఎక్కి దిగుతూనే ఉన్నారు. ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. తీర్పు వెలువడడానికి మూడు రోజుల ముందు వారు కోర్టుకు హాజరైన న్యాయాధికారి వద్ద తమ ఆవేదనను విన్నవించారు. చివరికి దోషులు ఎవరో తేలకుండా కేసు విచారణ ముగిసిపోయింది. కేసులో కొత్త సాక్ష్యాలు, ఆధారాలు ఏమీలేవని సీబీఐ ఇచ్చిన నివేదికను కోర్టు ఆమోదించింది. దాని ప్రకారం తీర్పును వెలువరించింది. సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గోపీనాథ్‌ చేసిన వాదనలతో కోర్టు అంగీకరించింది. తీర్పు వెలువడిన తర్వాత కేసుపై ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి అయేషా తల్లిదండ్రులకు కోర్టు అవకాశం ఇచ్చినా దానికి వారు విముఖతను వ్యక్తం చేశారు. కేసు సీబీఐకి అప్పగించిన నాటి నుంచి పలుమార్లు వారు హైకోర్టు తలుపులు తట్టారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు తెలియజేసిన తర్వాత ఆ నివేదిక కోసం కోర్టులో పోరాటం చేశారు. కేసులో సత్యంబాబును నిందితుడిగా నిర్ధారించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటీసు ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరించారు. తర్వాత స్వయంగా కోర్టుకు హాజరై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు తీరుపై ఆది నుంచి విశ్వాసాన్ని వ్యక్తం చేయని వారు చివరికి రీపోస్టుమార్టం కోసం సేకరించిన అవశేషాలను అయినా ఇప్పించాలని కోర్టును పిటిషన్‌ ద్వారా వేడుకున్నారు. ఈ అవశేషాలను 27వ తేదీన ఉదయం పది గంటలకు అప్పగిస్తామని తీర్పు ఇచ్చిన కాసేపటికి మొత్తం కేసుపై విచారణను ముగిస్తున్నట్టు మరో తీర్పు వచ్చింది. అసలు దోషులు ఎవరో తేలకుండా కేసు ముగిసిపోయింది.

Updated Date - Feb 21 , 2026 | 01:15 AM