Share News

రథసప్తమికి సర్వం సిద్ధం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:48 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్టుగానే 25న తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు...

రథసప్తమికి సర్వం సిద్ధం

  • బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాల తరహాలోనే వైభవంగా నిర్వహిస్తాం: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల, జనవరి 22(ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్టుగానే 25న తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడా రు. ఆరోజు తిరుమలకు 2.5లక్షల మంది భక్తులు వస్తారని ఆంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2,500 మంది పోలీసు, విజిలెన్స్‌ సిబ్బందితో పటిష్టమైన భద్రత నడుమ వాహనసేవలను నిర్వహిస్తామన్నారు. ఆరోజు గ్యాలరీల్లోకి చేరే భక్తుల కోసం 14 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నామమని వెల్లడించారు. 85 కౌంటర్ల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు అన్నపానీయాలను అందించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్‌(ప్రొటోకాల్‌ మినహా) దర్శనాలను రద్దు చేశామని, 24 నుంచి 26 వరకు తిరుపతిలో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తామని తెలిపారు. కాగా, రథసప్తమి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా టీటీడీ ఏఐ అధారిత సీసీ కెమెరాలను మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటు చేస్తోంది. వీటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. కాగా, తిరుమలతో పాటు అరసవల్లిలోనూ రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అరసవల్లిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు పట్టువస్ర్తాలు సమర్పిస్తారన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:49 AM