Share News

లిక్కర్‌ లేని బీచ్‌ శాక్‌లు

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:23 AM

సముద్ర తీరంలో మద్యం అమ్మకాలకు బీచ్‌ శాక్స్‌ (చిన్నపాటి రెస్టారెంట్లు) ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను బుధవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా విడుదల చేశారు.

లిక్కర్‌ లేని బీచ్‌ శాక్‌లు

  • బీరు, వైన్‌, రెడీ టూ డ్రింక్స్‌ విక్రయం

  • విశాఖ, సూర్యలంక బీచ్‌ల్లో పైలట్‌ ప్రాజెక్టు

  • నిబంధనలు విడుదల చేసిన ఎక్సైజ్‌ శాఖ

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరంలో మద్యం అమ్మకాలకు బీచ్‌ శాక్స్‌ (చిన్నపాటి రెస్టారెంట్లు) ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను బుధవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా విడుదల చేశారు. దీని ప్రకారం.. బీచ్‌ షాక్స్‌లో ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ లేదా ఫారిన్‌ లిక్కర్‌ అమ్మకాలు నిషేధం. కేవలం బీరు, వైన్‌, క్రాఫ్ట్‌ బీరు, రెడీ టూ డ్రింక్స్‌ మాత్రమే అమ్ముతారు. స్టార్‌ హోటళ్లు, పర్యాటక రిసార్టులు, పర్యాటక శాఖలో నమోదైన సంస్థలు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. వెయ్యి నుంచి 1500 చదరపు అడుగుల్లో వీటి నిర్మాణం ఉండాలి. స్థానిక సంస్థ అనుమతితో కిచెన్‌ ఏర్పాటు చేయాలి. తగిన పార్కింగ్‌ సదుపాయం ఉండాలి. డెక్‌ బెడ్లు, గొడుగుల ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. తొలుత పైలెట్‌ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌ల్లో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తారు. మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్‌లు జారీచేస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి పాలసీ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫీజు రూ.2లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్‌ ఫీజు రూ.10వేలు, రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రూ.7.5లక్షలు చెల్లించాలి. రెండో ఏడాది నుంచి 10శాతం ఫీజులు పెరుగుతాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8గంటల వరకు బీచ్‌ శాక్స్‌ పనివేళలు ఉంటాయి.

Updated Date - Jun 18 , 2026 | 03:26 AM