షుకూర్ కేరాఫ్ అఫ్ఘానిస్థాన్!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:10 AM
ఉగ్రవాద సంస్థలకు, వాటి సాహిత్యానికి ప్రచారం కల్పిస్తున్న బెనెక్స్ కామ్ గ్రూపు నిర్వహణ వెనుక అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అల్ హకీమ్ షుకూర్ ఉన్నట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
‘బెనెక్స్ కామ్’ హ్యాండ్లర్ అతడే
‘ఉగ్ర’ గ్రూపులో కర్త, కర్మ, క్రియ అతనేనని గుర్తింపు
బాంబుల తయారీ వీడియోలు గ్రూపులో పోస్టింగ్
మాస్కులు ధరించి ఆయుధాలతో ఫొటోలు కూడా
జాతీయ జెండాను అవమానిస్తూ వీడియోలు
అసభ్యకర పదాలతో జాతీయ గీతం ఆలాపన
పోలీసు కస్టడీలో వెలుగులోకి వచ్చిన వివరాలు
ముగిసిన ఉగ్ర సానుభూతిపరుల కస్టడీ
విజయవాడ, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద సంస్థలకు, వాటి సాహిత్యానికి ప్రచారం కల్పిస్తున్న బెనెక్స్ కామ్ గ్రూపు నిర్వహణ వెనుక అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అల్ హకీమ్ షుకూర్ ఉన్నట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ గ్రూపును ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ ఏర్పాటు చేసినప్పటికీ, దాని వెనుక కర్త, కర్మ, క్రియగా షుకూర్ వ్యవహరించినట్టు గుర్తించాయి. విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్, హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. విజయవాడ పోలీసులతో పాటు ఐదు రాష్ట్రాలకు చెందిన నిఘా అధికారులు వారిని సుదీర్ఘంగా విచారించారు. ఈ ఐదు రోజులు సాగిన కస్టడీలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
పాక్, అఫ్ఘాన్ నుంచి తుపాకులు..
బెనెక్స్ కామ్ గ్రూపులోని సభ్యులు విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో ముఖాలకు మాస్కులు ధరించి, ఆయుధాలు పట్టుకుని ఫొటోలు దిగి, వాటిని గ్రూపులో పోస్టు చేసి ప్రచారం చేసుకునేవారు. ఐసిస్ జెండాలను ప్రదర్శిస్తూ, జిహాదీ నినాదాలు చేస్తూ వీడియోలను పోస్టు చేశారు. ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకుని వీటిని పోస్ట్ చేసేవారు. జాతీయ గీతాన్ని అసభ్యకర పదాలతో ఆలపించిన వీడియోలను బెనెక్స్ కామ్‌లో పోస్టు చేశారు. జాతీయ జెండాను అవమానిస్తూ చిత్రీకరించిన వీడియోలనూ ఈ గ్రూపులో పెట్టినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. జిహాద్‌ను విశ్వసించని వారిని చంపాలని విదేశీ హ్యాండ్లర్లు సందేశాలు ఇచ్చినట్టు గుర్తించారు. దేశంలో షరియా చట్టం స్థాపించడానికి అందరూ శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని జిహాదీ నేతలు డాక్టర్ ఇస్రార్ అహ్మద్, అన్వర్ అల్ అవ్లాకీ చేసిన ప్రసంగాల వీడియోలను బెనెక్స్ కామ్‌లో పోస్టు చేశారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి రిక్రూట్‌మెంట్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బెనెక్స్ కామ్ సభ్యులకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లు అల్ హకీమ్ షుకూర్, మొహమ్మద్ హుజాయిఫా, నింజా, హేంరొక్సీ, అబూ ముహరీబ్, అబూ బలూషిల్ ఇస్లాంను అనుసరించని వారిని హత్య చేసేలా రెచ్చగొడుతున్నారు. అందుకు అవసరమైన తుపాకులు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి సమకూరుస్తామని గ్రూపులో భరోసా ఇచ్చారు. పేలుళ్లకు బ్లాక్ పౌడర్, ఐఈడీ ఏవిధంగా తయారు చేయాలన్న వీడియోలు, పీడీఫ్ డాక్యుమెంట్లను ఈ గ్రూపులో విదేశీ హ్యాండ్లర్లు పోస్టు చేశారు.