‘అక్షయపాత్ర’లో 500 కోట్ల భోజనాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:50 AM
అక్షయపాత్ర ఫౌండేషన్ గొప్ప మైలురాయిని చేరుకుంది. పాతికేళ్ల ప్రస్థానంలో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించింది.
పాతికేళ్ల ప్రస్థానంలో ఘనమైన మైలురాయి
2000 సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభం
ప్రస్తుతం 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో సేవలు
నిత్యం 23.5 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం
సంస్థకు రాష్ట్రపతి ప్రశంసలు
మంగళగిరి సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అక్షయపాత్ర ఫౌండేషన్ గొప్ప మైలురాయిని చేరుకుంది. పాతికేళ్ల ప్రస్థానంలో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజనం) పథకంలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర సేవలను వారు ప్రశంసించారు. రాష్ట్రపతి ముర్ము విద్యార్థులకు స్వయంగా భోజనం తినిపించి, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ తరఫున సంస్థ చైర్మన్ మధు పండిత్ దాస, వైస్ చైర్మన్ చంచలపతి దాస, ఏపీ సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్ వంశీధర దాస పాల్గొన్నారు. 2024, ఏప్రిల్ 2న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 400 కోట్ల భోజనాలు మైలురాయి కార్యక్రమం వేడుకగా జరిగిందని, ఇప్పుడు 500 కోట్ల భోజనాల వేడుక ఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరగడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఫౌండేషన్ సేవలకు మంత్రి లోకేశ్ ప్రశంసలు
అక్షయపాత్ర సంస్థ 25 ఏళ్ల ప్రస్థానంలో 500 కోట్ల భోజనాలు పూర్తిచేసుకోవడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానవాళికి సేవ చేయడం, ఆపన్నులను ఆదుకోవడం ద్వారానే మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమనే సందేశాన్ని అక్షయపాత్ర సంస్థ అందిస్తోందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించడంలో అక్షయపాత్ర కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ అక్షయపాత్ర సాధించిన అరుదైన ఘనతపై స్పందిస్తూ, సేవలను కొనియాడారు.