సంక్షోభంలోనూ సంతృప్తి భోజనం
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:21 AM
అక్షయ పాత్ర సేవా సంస్థ తన పేరును సార్థకం చేసుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశమంతా గ్యాస్ సంక్షోభంతో అల్లాడుతున్నా ఆ సంస్థ మాత్రం నిర్విఘ్నంగా భోజనాలు సరఫరా చేస్తోంది.
నిర్విఘ్నంగా ‘అక్షయ పాత్ర’ కార్యక్రమాలు
గ్యాస్‌పై ఆధారపడకుండా వంటకాలు
రోజుకు 80 వేల మందికి భోజనాల సరఫరా
ఆదర్శంగా అక్షయపాత్ర, హరేకృష్ణ సేవా సంస్థలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అక్షయ పాత్ర సేవా సంస్థ తన పేరును సార్థకం చేసుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశమంతా గ్యాస్ సంక్షోభంతో అల్లాడుతున్నా ఆ సంస్థ మాత్రం నిర్విఘ్నంగా భోజనాలు సరఫరా చేస్తోంది. కష్టకాలంలోను ఏ ఇబ్బందీ లేకుండా రోజూ 80 వేల మందికి ఆహారం పంపిణీ చేస్తోంది. గ్యాస్ లభించక అనేక హోటళ్లు, హాస్టళ్లు కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేస్తుంటే.. ఎల్పీజీ గ్యాస్ ను ఎక్కువగా వినియోగించని అక్షయ పాత్ర మా త్రం తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తోంది. పైగా గ్యాస్ వినియోగం తగ్గించి వంట పని పూర్తిచేసుకుంటోంది. విశాఖలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కంచరపాలెంలో ఉన్న కిచెన్ ద్వారా రోజూ 147 పాఠశాలలకు చెందిన 31 వేల మందికి ఆహారం అందిస్తున్నారు. ఇక్కడ రోజుకు పది సిలిండర్లు అవసరం కాగా ఇప్పుడు కేవలం ఐదు సిలిండర్లతోనే వంట పూర్తి చేస్తున్నారు. గంభీరంలోని కిచెన్ నుంచి 191 పాఠశాలల్లో 16వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. ఇక్కడ రోజుకు నాలుగు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ కిచెన్‌లో వంటకాల వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటుచేసి రోజుకు 15 కిలోల బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఒక్క ఎల్‌పీజీపైనే ఆధారపడకుండా అన్నం, పప్పు, కూరగాయలు ఉడికించడానికి అవసరమైన బాయిలర్లను డీజిల్‌తో నడుపుతోంది. దీనివల్ల ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు.
అన్న క్యాంటీన్లకు హరేకృష్ణ ద్వారా
విశాఖలో అన్న క్యాంటీన్లకు మూడు పూటలా అవసరమైన ఆహారాన్ని హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. దీనికి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఒక కిచెన్, ఆనందపురంలో మరో కిచెన్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ కిచెన్ ద్వారా రోజుకు 25 వేల మందికి మూడు పూటలా భోజనం తయారు చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ఆనందపురం కిచెన్ ద్వారా కేజీహెచ్‌లో రోగులకు, సహాయకులకు రోజుకు 1,200 మందికి, హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రిలో మరో 500 మందికి భోజనాలు అందిస్తున్నారు. ఇంధనం కోసం ఒక్క ఎల్‌పీజీపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకోవడంతో ప్రస్తుత సంక్షోభంలో కూడా ఇబ్బందుల నుంచి బయటపడుతున్నామని హరేకృష్ణ మూవ్‌మెంట్ అండ్ అక్షయ పాత్ర జోనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కించ భక్ష దాస తెలిపారు..