‘అక్షరం అండగా’.. భరోసా
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:36 AM
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సులు శనివారం సాలూరు, మండపేట, చంద్రగిరి నియోజకవర్గం రాయలపురంలో జరిగాయి.
సాలూరు, మండపేట, రాయలపురంలలో
పరిష్కారమే అజెండాగా’ సదస్సులు
పాల్గొన్న మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు వేగుళ్ల, పులివర్తి
సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సులు శనివారం సాలూరు, మండపేట, చంద్రగిరి నియోజకవర్గం రాయలపురంలో జరిగాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, పులివర్తి నాని ముఖ్యఅతిథులుగా హాజరై, ఆయా ప్రాంతాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారినికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ద్వారా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమేగాకుండా, వాటి పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేగుళ్ల
మండపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటి పరిధిలో 17వ వార్డులో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పత్తివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ కె.శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్, విద్యుత్ ఏఈ ముని తదితరులు హాజరయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ప్రశ్నించేవారు లేకపోవడంతోనే పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా కృషిచేస్తానని వేగుళ్ల హామీ ఇచ్చారు. వార్డులో దోమల సమస్యను కౌన్సిలర్ భవానీ లేవనెత్తగా సాయంత్రానికల్లా పరిష్కరించారు.