Share News

సమస్యలకు పరిష్కారం దిశగా..!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:14 AM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్‌ పంచాయతీ ఇందిరానగర్‌, హడ్కోకాలనీల్లో సమస్యల పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

సమస్యలకు పరిష్కారం దిశగా..!

  • అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా..

  • ఫలితమిస్తున్న ‘అక్షరం అండగా..

  • పరిష్కారమే అజెండాగా’

  • నరససన్నపేటలో రెండ్రోజుల్లోనే పరిస్థితిలో మార్పు

  • 16 వేలు వెచ్చించి గుంతలు కప్పిన విశ్రాంత ఉద్యోగి

  • పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే బగ్గు

  • వచ్చే విద్యాసంవత్సరానికి ముందే కొత్త భవనం శంకుస్థాపనకు హామీ

నరసన్నపేట, మార్చి 17(ఆంధ్యజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్‌ పంచాయతీ ఇందిరానగర్‌, హడ్కోకాలనీల్లో సమస్యల పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీల్లో సమస్యలపై ఈ నెల 15న ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన ప్రజలు.. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. రెండు రోజల నుంచి పారిశుధ్య కార్మికులు ఇంటింటా చెత్త సేకరిస్తున్నారు. వంశధార కాలువలో చెత్త వేయకుండా ప్రజలు ఇంటి వద్దే స్వచ్ఛరథాలకు అందజేస్తున్నారు. వంశధార శిథిల క్వార్టర్స్‌లో గంజాయి బ్యాచ్‌, మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నట్టు డొంకాన గాయత్రి ఆరోజు నేతల దృష్టికి తీసుకురావడంతో.. అదేరోజు నుంచి రాత్రి వేళల్లో పలుమార్లు ఎస్‌ఐ బి.గణేశ్‌, పోలీసు సిబ్బందితో ఈ ప్రాంతాలను తనిఖీ చేశారు. నిఘా పెంచారు. దీంతో మందుబాబుల బెడద లేదని హడ్కోకాలనీ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇందిరానగర్‌ నుంచి హడ్కోకాలనీ రహదారి ముందు భాగం గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు నాడు సదస్సులో స్థానికుడు ఎంఎస్ఎన్‌ దేవ్‌ ప్రస్తావించారు. ఈ సమస్యను కొంతమేర అయినా పరిష్కరించాలని ఇందిరానగర్‌ వాసి, రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ పొన్నాన లక్ష్మణరావు నేను సైతం అంటూ ముందుకొచ్చారు.


సుమారు రూ.16 వేలు వెచ్చించి.. 8 అడుగుల వరకూ సీసీ రోడ్డు పనులు చేయించారు. ఈ నేపథ్యంలో హడ్కోకాలనీ - వంశధార కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం పరిశీలించారు. వంటగది, మరుగుదొడ్లు, రన్నింగ్‌వాటర్‌ సదుపాయం, పిల్లలు మధ్యాహ్న భోజనం ఎక్కడ చేస్తున్నారో తదితర వివరాలను తెలుసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 04:15 AM